Stock market: భారత స్టాక్ మార్కెట్‌కు HMPV (హ్యూమన్ మెటాప్న్యుమోవైరస్) వైరస్ ప్రభావం చూపింది. దేశంలో తొలి రెండు కేసులు నమోదైనట్లు ప్రకటించటంతో మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 330 పాయింట్ల నష్టాల్లో ట్రేడైంది.
వైరస్ ఆందోళనతో పెట్టుబడిదారులు అమ్మకాలకే మొగ్గు చూపారు. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్ మధ్యాహ్నానికి నష్టాల్లోకి మారింది. మొదట కొన్ని పాయింట్లకు పరిమితమైన నష్టాలు, చివరకు 1200 పాయింట్ల వరకు పెరిగాయి. లాభాల్లో ఉన్న షేర్ల అమ్మకాలు విపరీతంగా పెరగడంతో మార్కెట్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లింది.
మధ్యాహ్నం 2 గంటల వరకూ మార్కెట్ విలువలో రూ.8 లక్షల కోట్ల నష్టం నమోదైంది. ఈ పరిణామాన్ని వ్యాపారులు “బ్లాక్ మండే”గా అభివర్ణించారు. కాగా, బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు ICMR ధృవీకరించింది. ఈ చిన్నారుల కుటుంబాలకు ట్రావెల్ హిస్టరీ లేకపోవటం వైరస్ వ్యాప్తిపై భయాన్ని పెంచింది.
పెట్టుబడిదారులలో చాలా మంది ఇప్పటికే మార్కెట్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య తగ్గుతోంది. అనుభవం లేని ట్రేడర్లు మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయి, ట్రేడింగ్ వదిలేస్తున్నారు.
వ్యాపారులు మార్కెట్ స్థితిని గమనిస్తూ, లాభాలను సాధించడం అంత సులభం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. HMPV వైరస్ ప్రభావం మరికొన్ని రోజుల్లో ఎలా ఉంటుందనేది స్పష్టమవుతుంది.