money laundering case: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబయిలోని జుహు ప్రాంతంలోని వారి నివాస స్థలాలు, పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్‌హౌస్‌ను తాత్కాలికంగా అటాచ్ చేసిన దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED).. నివాసం, ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని గత నెలలో వారికి నోటీసు పంపింది. ఈ క్రమంలో నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శిల్పాశెట్టి దంపతులకు పంపిన నోటీసులపై చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు బుధవారం EDని ఆదేశించింది. ఈ అంశంపై అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టులొ విచారణ జరగనుంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం రాజ్ కుంద్రాకు చెందిన 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ముంబై జోనల్ ఆఫీస్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. రాజ్ కుంద్రా దంపతులు తమ నివాస స్థలాలను ఖాళీ చేయాలని సెప్టెంబర్ 27న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
M/s వేరియబుల్ టెక్ Pte Ltd, దివంగత అమిత్ భరద్వాజ్, అజయ్ భరద్వాజ్, వివేక్ భరద్వాజ్, సింపీ భరద్వాజ్, మహేందర్ భరద్వాజ్, పలు MLM ఏజెంట్లపై మహారాష్ట్ర పోలీసులు, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించింది. బిట్‌కాయిన్‌ల రూపంలో నెలకు 10 శాతం రిటర్న్ ఇస్తామని ప్రజలను మోసం చేసి, వారి నుంచి బిట్‌కాయిన్‌ల రూపంలో (2017లోనే రూ. 6,600 కోట్లు) భారీ మొత్తంలో నిధులు సేకరించారని ఆరోపణలు వచ్చాయి.
ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేసినందుకు గాను బిట్‌కాయిన్ పోంజీ స్కామ్‌కు సంబంధించిన మాస్టర్ మైండ్, ప్రమోటర్ అమిత్ భరద్వాజ్ నుండి రాజ్ కుంద్రా 285 బిట్‌కాయిన్‌లను అందుకున్నట్లు ED దర్యాప్తులో వెల్లడైంది.