లడ్డూ అపవిత్రతకు దోష పరిహారం కోసం ఇవాళ తిరుమలలో అర్చకులు శాంతియాగం చేస్తున్నారు. విమాన ప్రాకారం వద్ద మూడు హోమ గుండాలతో మహా క్రతువు హోమం చేపట్టారు. అనంతరం పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తారు. ప్రసాదం పోటు, ద్రవ్యశాల, ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయంలో సంప్రోక్షణ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు టీటీడీ శాంతి హోమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు.
ఇక తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ‘ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన.. త్వరలోనే తిరుమలలో FSSL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
టీటీడీ ప్రక్షాళన కోసం శ్యామలరావును ప్రత్యేకంగా నియమించినట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యతను దేవుడు తనకిచ్చాడని చెప్పారు. ఘుమఘులాడాల్సిన శ్రీవారి లడ్డూ పేలవంగా మారిందన్న చంద్రబాబు… మూడు రోజులకే చెడిపోతోందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రసాదాన్ని కల్తీ చేశారని సీఎం మండిపడ్డారు. అనుభవం లేని వారికి కాంట్రాక్టులు ఇచ్చారు. రూ.319కి కిలో నెయ్యి కొన్నారు. ఆ ధరకు వనస్పతి, పామాయిల్ కూడా రాదని పేర్కొన్నారు.