Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద బుల్లెట్ ప్రూఫ్ గోడను నిర్మించారు. గతేడాది ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో లారెన్స్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న దుండగులు కాల్పులు జరిపారు. దీంతో సల్మాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇప్పుడు సల్మాన్ బాల్కనీ, కిటికీలు బుల్లెట్ ప్రూఫ్‌గా మారాయి.
సల్మాన్‌కు చెందిన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆ ఇంటి బాల్కనీ, కిటికీలు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో కనిపిస్తున్నాయి. సల్మాన్ భద్రతా వ్యవస్థను హైటెక్‌గా తీర్చిదిద్దినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇంటి చుట్టూ హై రిజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 1BHKలో నివసిస్తున్నారు. అతని తల్లిదండ్రులు ఈ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో నివసిస్తున్నారు.
8 నెలల క్రితం అంటే ఏప్రిల్ 14న తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో 7.6 బోర్ తుపాకీ నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వారు ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో చిక్కారు. కాల్పులు జరిగిన గోడకు కొద్ది దూరంలో సల్మాన్ బాల్కనీ ఉంది. అక్కడ ఆయన తన అభిమానులను కలవడానికి వస్తారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు లైవ్ బుల్లెట్‌ను గుర్తించారు. ఈ దాడికి లారెన్స్ గ్రూప్ బాధ్యత వహించింది.