Rains: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావం మరో రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ ప్రభావంతో సోమవారం, మంగళవారం రోజులలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
వర్షాలు కురిసే ప్రాంతాలు:
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతోంది:
ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో రెండూ 5.57 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయని పేర్కొన్నారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
జనం అప్రమత్తంగా ఉండాలి:
గోదావరి, తుంగభద్ర, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.