NDA CMs Meeting: నేటి దేశ పాలనలో ఉత్తమ పరిపాలన అమలే ప్రధాన లక్ష్యంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూఢిల్లీ లో ఆదివారం ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమాఖ్య సమావేశం జరగనుంది. దేశ భద్రత, ప్రజా సంక్షేమం, పాలనలో పారదర్శకతను మరింత మెరుగుపరిచే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. శనివారం రాత్రే ఆయన న్యూఢిల్లీకి చేరుకున్నారు.
భారీ నేతల సమక్షంలో చర్చలు
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయేకు చెందిన 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొననున్నారు.
ఈ సమావేశాన్ని బీజేపీ సుపరిపాలన విభాగం సమన్వయంతో నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పరిపాలన నమూనాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనలపై చర్చించనున్నారు.
రెండు కీలక తీర్మానాలకు ఆమోదం
ఈ సమావేశంలో ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా నిర్వహించిన భారత రక్షణ దళాల సేవలకు సంఘీభావంగా ప్రధాని మోదీకి అభినందన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనాభా లెక్కల్లో కులగణన నిర్ణయానికి కూడా మద్దతుగా మరో తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉంది.
ప్రత్యేక దినోత్సవాలపై చర్చ
ఈ సమావేశంలో ఎన్డీయే మూడవ విడత పాలన తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవం, అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యాన్ని పురస్కరించుకుని, లోక్‌తంత్ర హత్య దినం నిర్వహణపై కూడా చర్చించనున్నారు.
సమావేశానికి ప్రాధాన్యత
ఈ సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో పాలన స్థాయిని మెరుగుపర్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల అనుభవాలను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాల సమన్వయం మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.