New York Bus Accident: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయాగరా జలపాతాలను చూసి తిరిగి వస్తున్న పర్యాటకులతో నిండిన బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సులో మొత్తం 54 మంది పర్యాటకులు ఉన్నారు. ఈ ప్రమాదం న్యూయార్క్ రాష్ట్రంలోని ఇంటర్‌స్టేట్ 90 రహదారిపై పెంబ్రోక్ సమీపంలో జరిగింది. నివేదికల ప్రకారం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు పక్కకు ఒరిగి, బోల్తా పడింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Crime News: ప్రియుడే కావాలి.. భర్తను కూతురిని చంపిన భార్య.. 500 జరిమానా విధించిన కోర్ట్..
మరణించినవారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. నాలుగు హెలికాప్టర్‌లు, పలు అంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ విచారం వ్యక్తం చేశారు, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.