nayanthara

Nayanthara: నయనానంద నాయిక.. నయనతార

Nayanthara: ధూళి నుండి లేచిన ద్యుమణి చిత్రసీమకు గొప్ప వెలుగు నిస్తుందని బహుశా రెండు దశాబ్దాల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. దక్షిణ భారతంలోని ఆ కొసన మెరిసిన నయనానందకర తార… ఇప్పుడు ఉత్తరాది వారికీ వినోదాన్ని పంచుతోంది. నవంబర్ 18తో నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లేడీ సూపర్ స్టార్ నయనతార జీవన ప్రయాణాన్ని తెలుసుకుందాం. 

అభినయం గురించి అవగాహనలేని ఓ వ్యక్తి నట శిఖరాలను అధిరోహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమాయణంలోని చేదు జ్ఞాపకాలను విస్మరించి..సంతృప్తికర వైవాహిక జీవితాన్ని కొనసాగించడం ఆత్మతృప్తిని కలిగిస్తుంది. రెండు దశాబ్దాల కాలంలో నయనతార స్పృశించిన సంఘటనలే ఇవన్నీ!

ఇవాళ నయనతార సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గత యేడాది ఉత్తరాదిన ‘జవాన్’తో జెండా పాతి… జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరేసిన సక్సెస్ ఫుల్ యాక్ట్రస్. అయితే ఆమె జీవితం అందరూ అనుకునేట్టు వడ్డించిన విస్తరి కాదు… సినిమా రంగంతో సంబంధం లేని కుటుంబ నుండి రావడంతో ఎన్నో అవమానాలను, ఎన్నో అవహేళలను ఎదుర్కొని… ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ… తన కంటూ ఓ దుర్గాన్ని నిర్మించుకుంది. విశేషం ఏమంటే… అనితరసాధ్యమైన ఆ దుర్గం నిర్మాణాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ నయన్ బర్త్ డే సందర్భంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందించింది.

నయనతార వార్తలలో నానడం కొత్తేమీ కాదు… అలానే గత రెండు మూడు రోజులుగా విశేషంగా జాతీయ స్థాయిలో ఆమె పేరు వినిపిస్తోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’లో తాను నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ విజువల్స్ ను వాడుకోవడానికి నిర్మాత ధనుష్ అంగీకరించకపోవడంతో నయన్ మూడు పేజీల ఓపెన్ లెటర్ రాసింది. జాతీయ ఉత్తమ నటుడు, సినిమా రంగంలో విశేషమైన ఫ్యాన్ బేస్ ఉన్న ధనుష్ వంటి స్టార్ హీరోగా నయన్ ఇలా గొడవకు దిగడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయినా నయన్ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగానే ముందుకు సాగింది.

‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ట్రైలర్ లో ‘నానుమ్ రౌడీ దాన్’ ఫోటోలను మూడు సెకన్ల పాటు వాడుకుంది. దానికి గానూ పది కోట్ల రూపాయల నష్టపరిహారం కోరాడు ధనుష్. అయితే నిజం చెప్పాలంటే వీరిద్దరి జరుగుతున్న ఈ వివాదం ఆర్థికపరమైనది కాదు… ఇగోకు సంబంధించింది. తనకు నటన రాదంటూ ధనుష్ అవహేళన చేసిన విషయాన్ని నయన్ అంత తేలికగా మర్చిపోలేకుండా ఉంది. అలానే ఫిల్మ్ ఫేర్ అవార్డుల సమయంలో ‘నానుమ్ రౌడీదాన్’ మూవీకి గానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంటూ తనను కించపర్చుతూ నయన్ మాట్లాడిన మాటలను ధనుష్ కూడా మర్చిపోలేకపోతున్నాడు. చిత్రం ఏమంటే… ఈ సినిమాకు కొంతకాలం ముందు వీరిద్దరూ కలిసి ‘యారిడి నీ మోహినీ’ చిత్రంలో నటించారు.

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా… ఇవాళ నయనతార సౌతిండియన్ సూపర్ స్టార్. 2002లో డయానా కురియన్ గా మోడలింగ్ రంగంలోకి సరదాగా అడుగుపెట్టిన ఆమె… ఇవాళ నయనతారగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేసిన నయన్ అన్నీ అనుకూలిస్తే.. చార్టెడ్ అక్కౌంటెంట్ అవ్వాలని అనుకుంది. అదే సమయంలో ‘మనస్సినక్కరే’ చిత్రంలో అవకాశం రావడంతో కాదలేకపోయింది. అలా తొలిసారి సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టిన నయన్ కు ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.

మల్లూవుడ్ లో నటిగా కెరీర్ ప్రారంభించిన నయనతారను కోలీవుడ్ లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. శరత్ కుమార్ సరసన ‘అయ్యా’ సినిమాలో నటిస్తున్న సమయంలోనే దర్శకులు పి. వాసు ఆమెకు ‘చంద్రముఖి’లో అవకాశాన్ని ఇచ్చారు. చిన్నప్పటి నుండి రజనీకాంత్ మూవీస్  చూస్తూ పెరిగిన నయనతారకు ఇది ఊహించని బంపర్ ఆఫర్. దాంతో ఆమె మరో మాట లేకుండా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

తమిళంలో వరుసగా ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలలో అవకాశాలు రావడంతో నయనతార కు ఓవర్ నైట్ గుర్తింపు వచ్చేసింది. అక్కడ నుండి ఆమె అవకాశాల కోసం వెతుక్కోవలసిన అవసరమే కలగలేదు. ‘అయ్యా, చంద్రముఖి’ తర్వాత అదే యేడాది వచ్చిన సూర్య ‘గజిని’లో నయనతార కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా అందులో ఆమె చేసిన సాంగ్ కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. ‘చంద్రముఖి’లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన నయనతార గ్లామర్ రోల్స్ కూ సెట్ అవుతుందని ‘గజిని’ సినిమా నిరూపించింది.

సినిమారంగంలో ప్రశంసల పూలజల్లే కాదు… విమర్శల జడివాన కూడా ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సినిమా రంగంలో సంబంధం లేకుండానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకున్న నయనతార సైతం ఆ రెండింటినీ ఆస్వాదించాల్సి వచ్చింది. ఆ విమర్శలను పాజిటివ్ గా తీసుకుని… తనను తాను మరింత మెరుగ్గా మలుచుకుంది.

నయనతార చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా మెలగాలో, హీరోయిన్ అంటే ఎలా ఉండాలో కూడా తెలియదు. ఉన్నది ఉన్నట్టుగా వ్యవహరించడం అలవాటైన నయనతార తొలి రోజుల్లో తాను బాడీ షేమింగ్ కు గురయ్యానని స్వయంగా తెలిపింది. ‘అయ్య, చంద్రముఖి’ వంటి సినిమాలలో తన నటనను చాలామంది వంక పెట్టేవారని, అలానే హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలను తాను తొందరగా ఒంట పట్టించుకోలేకపోయానని చెబుతుండేది. 2006లో ‘లక్ష్మీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయనతార గ్లామర్ హీరోయిన్ గానే కాదు.. నటిగానూ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ALSO READ  UCC: ఆ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్‌ కు మంత్రివర్గ ఆమోదం 

తెలుగు సినిమా రంగంలోనూ స్టార్ హీరోలతోనే ఎంట్రీ ఇవ్వడం నయనతారకు కలిసొచ్చింది. ‘లక్ష్మీ’ విజయం తర్వాత ఆమె అదే యేడాది నాగార్జున సరసన ‘బాస్’లో నటించింది. ఇది కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారక్టరే. అయితే… ఆ తర్వాత యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘యోగి’ సినిమా నయన్ కు కమర్షియల్ సక్సెస్ ఇవ్వకపోయినా… ప్రభాస్ కు సరిజోడి అనే పేరు తెచ్చుకుంది. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ కావడంతో నయన్ తెలుగులోనూ మాస్ ఆడియెన్స్ కు చేరువైంది.

పొంగల్ కానుకగా వచ్చిన ‘యోగి’ కమర్షియల్ గా నిరాశకు గురిచేసినా… అదే యేడాది వేసవి కానుకగా వచ్చిన ‘దుబాయ్ శీను’ మూవీ ఆమెకు మంచి విజయాన్నిఅందించింది. ఆ కారణంగానే ఆ తర్వాత మాస్ మహరాజా రవితేజ సరసన ఆమె ‘ఆంజనేయులు’ మూవీలోనూ నటించడానికి కారణమైంది. ‘దుబాయ్ శీను’ స్థాయిలో కాకపోయినా… ‘ఆంజనేయులు’ మూవీ సైతం గౌరవ ప్రదమైన విజయాన్నే అందుకుంది.

వెంకటేశ్ ‘లక్ష్మీ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్… ఈ సీనియర్ స్టార్ హీరో సరసన నటించిన రెండో సినిమా ‘తులసీ’ కూడా గ్రాండ్ సక్సెస్ సాధించింది. ‘లక్ష్మీ’ని వి.వి. వినాయక్ తెరకెక్కించగా… ‘తులసీ’ మూవీని బోయపాటి శ్రీను రూపొందించారు. చిత్రం ఏమంటే… వెంకీ, నయన్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘బాబు బంగారం’ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ టైమ్ లో నయన్ బిజీగా ఉండటంతో… ఆమెపై చిత్రీకరించాల్సిన ఓ పాటను సైతం తీయలేకపోయారనే మాట వినిపించింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మరే చిత్రమూ రాలేదు!

‘బాస్’లో తొలిసారి నాగార్జున సరసన నటించిన నయనతారకు ఆ తర్వాత కూడా నాగ్ సరసన మరో సినిమాలలో నటించే ఛాన్స్ దక్కింది. వీరిద్దరి కాంబోలో ‘గ్రీకువీరుడు’ వచ్చింది. కానీ ఇది కమర్షియల్ గా పరాజయం పాలైంది. తెలుగులో నయనతార ఓ రేర్ ఫీట్ ను సాధించింది. వెంకటేశ్ తో మూడు చిత్రాలు చేసిన నయనతార… వెంకటేశ్ అన్న కొడుకు రానాతో ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో నటించింది. వెంకీ సినిమాలంతా ఘన విజయాన్ని ఇది సాధించకపోయినా… విమర్శకుల ప్రశంసలను ‘కృష్ణం వందే జగద్గురుమ్’ పొందింది.

విక్టరీ వెంకటేశ్ తర్వాత రానాతో జోడీ కట్టిన నయన్ నందమూరి ఫ్యామిలీ విషయానికి వచ్చే సరికీ ఇది రివర్స్ అయ్యింది. అప్పటికే వి.వి. వినాయక్ చిత్రాలలో నటించిన నయన్ ఆయన డైరెక్షన్ లోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘అదుర్స్’లో నటించింది. అగ్రహారంలోని బ్రాహ్మణ యువతిగా ఈ సినిమాలో నయన్ కనిపిస్తుంది. ఆమెపై బ్రహ్మానందం మనసు పారేసుకునే సన్నివేశాలు యూత్ ను బాగా ఎంట్రాక్ట్ చేశాయి. ఇక ఎన్టీఆర్, నయన్ జోడీని వారి ఫ్యాన్స్ ఆస్వాదించారు. 

‘అదుర్స్’ మూవీ ఘన విజయం సాధించిన వేళా విశేషం…. ఆ తర్వాత కొద్ది నెలలకే నయనతార… జూనియర్ ఎన్టీఆర్ బాబాయి నందమూరి బాలకృష్ణ సరసన ‘సింహా’లో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఆ యేడాది ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. 

నటనను వృత్తిగా స్వీకరించిన తర్వాత నయనతార తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు కృషి చేసింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల కారణంగా కొన్ని సార్లు చిత్రసీమ నుండి తప్పుకోవాలని అనుకుంది. కానీ అదే జరిగి ఉంటే… మనకు ‘శ్రీరామరాజ్యం’లో సీతగా ఆమె కనిపించి ఉండేది కాదు.

‘సింహ’ సినిమాలో నయనతారతో పాటు నమిత, స్నేహా ఉల్లాల్ కూడా నటించారు. కానీ నయనతార గ్రేస్ ముందు వీరెవ్వరూ నిలబడలేకపోయారు. బహుశా అందుకే కావచ్చు… ప్రముఖ దర్శకుడు బాపుకు నయనతారలో సీతమ్మ కనిపించింది. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో బాలకృష్ణ శ్రీరాముడిగా నటిస్తే… ఆయన ధర్మపత్ని సీతమ్మ పాత్రను నయనతార పోషించింది. ఈ సినిమాకు గానూ తొలిసారి ఆమె నంది అవార్డుకు ఎంపికైంది. నయనతార గతంలో చేసిన పాత్రలను తెర మీదకు తీసుకొచ్చి… సీతమ్మగా నయనతారు చూడాలా!? అని విమర్శించిన వారిని సైతం తన నటనతో మెప్పించింది నయనతార. తన కెరీర్ లో క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు లభించిన సీతమ్మ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని పోషించానంటుంది నయనతార. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సజల నయనాలతో ఆ చిత్ర బృందానికి వీడ్కోలు పలికిందామె. బాలకృష్ణతో ఉన్న ఆ అనుబంధంతోనే ఆ తర్వాత ‘జై సింహా’ సినిమాలో చేసింది.

నయనతారలో ఉన్న పొటన్షియాలిటీని గుర్తించిన శేఖర్  కమ్ముల తన తొలి రీమేక్ చిత్రానికి ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. విద్యాబాలన్ నటించిన హిందీ సినిమా ‘కహాని’ ని తెలుగు, తమిళ భాషల్లో తీస్తూ శేఖర్  కమ్ముల నయన ను హీరోయిన్ పెట్టుకున్నాడు. ‘అనామిక’ పేరుతో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ఆ తర్వాత నయన్ మరిన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి గట్టి నమ్మకాన్ని కలిగించింది.

anamika

తెలుగులో అగ్ర కథానాయకులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తో ఒకటికి మించిన సినిమాలలో నటించిన నయనతార చిరంజీవితో నటించడానికి మాత్రం చాలా టైమ్ తీసుకుంది. చిరంజీవి సరసన ‘సైరా’ మూవీలో నాయికగా నటించిన నయన్… ఆ తర్వాత ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’లో ఓ కీలక పాత్రను పోషించింది. గత కొంతకాలంగా తెలుగు రంగానికి ఆమె దూరంగానే ఉంటోంది. కథ నచ్చాలే కానీ స్టార్స్ నటించే భారీ బడ్జెట్ చిత్రాలలోనే కాదు మీడియం బడ్జెట్ చిత్రాల్లోనూ నయన్ నటించింది. అలా ఆమె చేసిన గోపీచంద్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ చాలా ఆలస్యంగా జనం ముందుకు వచ్చింది.

ALSO READ  Tollywood: 'ది 100' ట్రైలర్ విడుదల

నయనతార తెలుగులో తక్కువ సినిమాలే చేసినా… ఇక్కడి ప్రేక్షకులు మాత్రం ఆమెను ఏ మాత్రం మిస్ కావడం లేదు. ఎందుకంటే.. నయన్ నటించే తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు తెలుగులోనూ డబ్ అవుతూనే ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలను పక్కన పెట్టిన ‘రాజా రాణీ’, ‘భాస్కర్ ది రాస్కేల్’, ‘కొలమావు కోకిల’ వంటి సినిమాల్లో నయన్ నటనను చూసి తెలుగు ప్రేక్షకులు వాటినీ బాగా ఆదరించారు.

అందరు స్టార్స్ మాదిరిగానే నయనతార కెరీర్ లోనూ అప్ అండ్ డౌన్స్  ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో చేదు సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ప్రేమించడం అంటూ జరిగితే పూర్తిగా నూరు శాతం వారికి సరండర్ అవ్వాలనే మనస్తత్త్వం నయనతార ది. అదే ఆమెకు బోలెడు గుణపాఠాలను నేర్చింది.

nayanthara

సినిమా రంగంతో సంబంధం లేని నయన్ కు కెరీర్ తొలి నాళ్ళలో సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేకపోయారు. దాంతో తనను తానుగా ప్రేమించే వారి కోసం నయన్ పరితపించిందనిపిస్తుంది. అందుకే ఎవరితో అయినా ఆమె ఠక్కున కనెక్ట్ అయ్యేది. కానీ ఈ అనుబంధాల్నీ ఆర్థికపరమైనవి ఆమెకు అర్థమయ్యే సరికీ ఆలస్యమయ్యేది. దాంతో ఆపైన ఆచితూచి అడుగులు వేయడం చేసింది. తమిళ యువ నటుడు శింబు సరసన ‘వల్లవన్’ సినిమాలో నటించింది నయన్. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురులు తొడిగింది. కానీ కొద్ది రోజులకే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభుదేవాతో నయన నడిపిన ప్రేమాయణం పెళ్ళి పీటలు వరకూ వెళ్ళింది. ప్రభుదేవా కోరిక మేరకు ఆమె హిందుమతాన్ని స్వీకరించదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఊహకందని విధంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ సమయంలోనే సినిమాలకు పూర్తి స్థాయిలో  దూరం కావాలని నయనతార అనుకుంది. కానీ ఆమెకు దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపంలో ఓ స్నేహహస్తం లభించింది. తిరిగి కోలుకుని నటనపై దృష్టి పెట్టింది. విఘ్నేష్ తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’లోనూ, ఆపైన అతనే విజయ్ సేతుపతితో తీసిన ‘కె.ఆర్.కె.’ చిత్రాలలోనూ నయన్ నటించింది.

గడిచిన రెండు దశాబ్దాల కాలంలో నయనతార స్టార్ హీరోలతో  చేసిన సినిమాలే కాదు యంగ్ హీరోలతో  చేసిన అనేక సినిమాలు విజయపథంలో సాగిపోయాయి. అజిత్ తో పాటు యువ కథానాయకులతోనూ ఆమె ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఇవన్నీ ఆమె కెరీర్ ముందుకు సాగడానికి ఉపకరించాయి. విశేషం ఏమంటే… నయనతార పారితోషికం కోట్లకు పడగలెత్తినా… ఆమెతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసే వాళ్ళు వస్తూనే ఉన్నాయి. తన పొటన్షియాలిటీని గుర్తించే తనకు పారితోషికం ఇస్తారు తప్పితే డిమాండ్ చేసినంత మాత్రాన ఇవ్వరనేది నయన్ చెప్పే మాట. సౌతిండియన్ లేడీ స్టార్ గా ఉన్న నయనతార కథ నచ్చాలే కానీ చిన్న సినిమాలకూ సై అంటుంది. అందుకు ఉదాహరణ ‘మూకుత్తి అమ్మన్’ సినిమానే. ఆర్జే బాలాజీ నటించి, తన స్నేహితుడితో కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార నటించింది. సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ను సి. సుందర్ డైరెక్ట్ చేయబోతున్నారు.

నయన్ వ్యక్తిగత జీవితమే కాదు… ఆమె నటించిన సినిమాలూ కొన్ని సందర్భాలలో వివాదాలకు తెరలేపాయి. ఇటీవల నయన్ నటించిన ‘అన్నపూర్ణి’ సినిమా ఓటీటీలో ప్రసారం అయినప్పుడు హిందుత్వ సంస్థలు ఆమెపై ధ్వజమెత్తాయి. ఆ మూవీని ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి. అభ్యంతరకరమైన కొన్ని సన్నివేశాలను తొలగించి చివరకు మళ్ళీ రీ-స్ట్రీమింగ్  చేశారు.

కొన్నేళ్ళుగా దక్షిణాది చిత్రాలకే పరిమితమైన నయన్ గత యేడాది బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తమిళంలో తనకు సూపర్ హిట్ మూవీ ‘రాజా రాణీ’ని ఇచ్చిన అట్లీ మాట కాదనలేక నయన్ హిందీ సినిమాలో నటించిందనే వారూ లేకపోలేదు. అయినా… ‘జవాన్’తో నయన్ ఉత్తరాదిన తన సత్తాను చాటింది. అయితే ఇప్పటి వరకూ మరో సినిమాకు ఆమె అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

nayanthara

విఘ్నేష్ శివన్ ను 2022లో వివాహం చేసుకున్న నయనతార ఇప్పుడు ఇద్దరు కవలల తల్లి కూడా! సరొగసీ ద్వారా పిల్లలను కన్న నయన్ వారి ఐడెంటీనీ దాచే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. పిల్లలతో కలిసి ఫోటోలు దిగి… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు నయనతార భర్తతో కలిసి రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ లో సినిమాలూ నిర్మిస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో నయన్ సినిమాలు చేస్తోంది. నవంబర్ 18 నయన్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న ‘రక్కాయి’ మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.

నయన్ – ధనుష్ మధ్య చోటు చేసుకున్న వివాదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం.  నయన్ తన నటనతో మరికొంతకాలం అభిమానులను మెప్పించాలని ఆశిద్దాం.

dhanush

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *