NHRC: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఒక యువకుడి మరణంపై తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీ చేసింది. పోలీసుల చిత్రహింసల వల్లే యువకుడు చనిపోయాడని మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన NHRC, ఈ ఘటనపై రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఘటన వివరాలు
టోలీచౌకికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (35) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. ఇర్ఫాన్ మరో మహిళతో సన్నిహితంగా ఉండటంపై రెండో భార్య అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. మే 13న పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇరు వర్గాలు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. భర్తపై రెండో భార్య ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఇర్ఫాన్‌ను లోపలికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే, పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఇర్ఫాన్ కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇర్ఫాన్ చనిపోయాడు.
కుటుంబసభ్యుల ఆరోపణలు, పోలీసుల వివరణ
పోలీసులు కొట్టడం వల్లే ఇర్ఫాన్ చనిపోయాడని అతడి సోదరుడు ఆరోపించాడు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. తాము ఇర్ఫాన్‌ను కొట్టలేదని, అతడి మరణానికి పోలీసుల చిత్రహింసలు కారణం కాదని స్పష్టం చేశారు.
మీడియాలో ఈ ఘటనపై విస్తృత కథనాలు రావడంతో జాతీయ మానవ హక్కుల సంఘం దీనిని తీవ్రంగా పరిగణించింది. ఈ కథనాల్లోని విషయాలు నిజమైతే, బాధితుడి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టేనని కమిషన్ పేర్కొంది. అందుకే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.