Sharmila: రాజకీయాలు పక్కకు పెట్టి తెలుగోడికి మద్దతు ఇవ్వండి

Sharmila: ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగువాడైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో, వైఎస్ షర్మిల ఒక కీలక విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన రాజకీయ నేతలు – టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ – పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, తెలుగు బిడ్డగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆమె మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని షర్మిల అభివర్ణించారు. ఆయన ఎలాంటి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, స్వతంత్ర నిపుణుడని ఆమె స్పష్టం చేశారు. “ఆయన కాంగ్రెస్ సభ్యుడు కాదు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన న్యాయ రంగంలో విశేష అనుభవం సొంతం చేసుకున్నారు. ఈ ఎంపికను రాజకీయ కోణంలో చూడకూడదు” అని ఆమె పేర్కొన్నారు.

దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి నిష్పక్షపాత న్యాయ నిపుణులు ఉన్నత పదవుల్లో ఉండటం అవసరమని ఇండియా కూటమి భావిస్తోందని షర్మిల అన్నారు.

పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, తెలుగువారికి దక్కిన ఈ గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ కలిసిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలుగువారి ఐక్యతను చాటాలని షర్మిల సూచించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *