Nara lokesh: ఆంధ్రప్రదేశ్ నగరాలన్నీ డిజిటల్ వృద్ధికి కేంద్రాలుగా మారాలని కోరుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న మేధా హైటెక్ సిటీలో ఎక్లాట్ (E-CLAT) హెల్త్ సొల్యూషన్స్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌ను సంస్థ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు. అలాగే ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు.
విజయవాడకు గర్వకారణం
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, “మెడికల్ కోడింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎక్లాట్ సంస్థ నూతన కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇది నగరానికి గర్వకారణమే కాకుండా, రాష్ట్ర ఐటీ రంగం ఎదుగుదలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మెగా నగరాలను విడిచిపెట్టి చిన్న నగరాల్లో పెట్టుబడులు పెట్టడం ఒక గొప్ప ఆలోచన. కార్తిక్ పోల్సాని, స్నేహ పోల్సాని దంపతులు ఈ దిశగా ముందడుగు వేసినందుకు అభినందనలు. కరీంనగర్‌ను అవకాశంగా మలిచినట్లే ఇప్పుడు విజయవాడను కూడా ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు,” అని అన్నారు.
అమెరికాలో అతిపెద్ద హెల్త్ సిస్టమ్‌తో ఎక్లాట్
అమెరికాలో ఆరోగ్య సంరక్షణ సేవలందించే అతిపెద్ద వ్యవస్థగా ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ గుర్తింపు పొందింది. రెవెన్యూ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్స్‌లో ఈ సంస్థకు విశేషమైన నైపుణ్యం ఉంది. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, ఆడిటింగ్, హెచ్‌సీసీ కోడింగ్ వంటి విభాగాల్లో విశేష సేవలందిస్తోంది. 2008లో కార్తిక్ పోల్సాని ఈ సంస్థను స్థాపించగా, ప్రస్తుతం స్నేహ పోల్సాని నాయకత్వంలో మరింత వేగంగా విస్తరిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా నిపుణులు సంస్థలో సేవలందిస్తున్నారు. భారత్‌లో హైదరాబాద్, కరీంనగర్, లక్నో, ముంబయిలో కార్యాలయాలున్నాయి. తాజాగా విజయవాడలోని మేధా ఐటీ పార్క్‌లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేశారు. రెండు నెలల వ్యవధిలోనే 300 మందిని నియమించగా, వచ్చే ఏడాది చివరికి మరో 1,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
“ఇది కేవలం ఒక సంస్థ ఆరంభం కాదు – వేల మందికీ డిజిటల్ సాధికారత కలిగించే కొత్త దిశా ప్రారంభం” అని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.