Nadendla manohar: వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడి, సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసిందని అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని నాదెండ్ల పేర్కొన్నారు. “గతేడాది జూన్ 4న రాష్ట్రం రాక్షస పాలన నుంచి విముక్తి పొందింది. అందుకే దీన్ని దీపావళిగా, సంక్రాంతిలా జరుపుకుందాం. ప్రతి ఇంటి వద్ద రంగులతో ముగ్గులు వేసి పండుగలా జరుపుకోవాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.విజయవాడ విద్యాధరపురం సర్కిల్‌లోని చౌకధరల దుకాణాలు నం.10 మరియు 15లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సౌరబ్ గౌర్‌తో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తన పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల ముందుగా విద్యాధరపురంలోని వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులు అందించారు. రేషన్ విధానంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే స్థానికులు డీలర్లు అందిస్తున్న బియ్యం నాణ్యతపై ఏమంటున్నారో పరిశీలించారు.
చెరువు సెంటర్‌లోని రెండు షాపుల్లో ఆయన తనిఖీలు కొనసాగించారు. షాపుల వద్ద డిస్‌ప్లే బోర్డు, ఇంటర్నెట్ సదుపాయాలు, సర్వర్ పనితీరు, మెటీరియల్ నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ఇంటింటికీ సేవ లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్నాం. ‘ఎనీటైం రేషన్’ ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు తమకు అనుకూల సమయాల్లో రేషన్ తీసుకునేలా సౌకర్యం కల్పించాం” అని వివరించారు.
జూన్ 1 నుంచి మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల 14 వేల కార్డుదారులకు రేషన్ సరుకులు అందించామని, ఇది మొత్తం లబ్ధిదారుల్లో 42.14 శాతం అని తెలిపారు.
అలాగే, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య వారి ఇళ్లకు రేషన్ సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి ఇంటికే సరుకులు పంపించినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి కూడా ఈ నెల 5వ తేదీ లోపు సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు.
రేషన్ షాపుల్లో వినియోగదారుల కోసం ఉత్తమ సదుపాయాలు కల్పించామని, గతంలో అమలులో ఉన్న పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని తెలిపారు. రేషన్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా, నిష్ఠతో పనిచేయాలని డీలర్లను ఆదేశించారు.