mp aravind: బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.
బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీజేపీ భరోసా యాత్రలో ప్రజల నుంచి అనేక వినతిపత్రాలు అందాయి. ముఖ్యంగా దివ్యాంగులు తమ సమస్యల్ని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై peoples trust తగ్గిపోతోంది” అని చెప్పారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్రంగా స్పందించిన అర్వింద్, “ఆయన సగం కాంగ్రెస్, సగం బీఆర్‌ఎస్ నేతలా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమాలన్నీ సీఎం సూచనల ప్రకారమే. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన రాజకీయ నాటకం,” అని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా స్పందించిన అర్వింద్, “నన్ను ఎస్ఐటీ విచారణకు పిలిచినట్లు వార్తలు వస్తున్నా, నాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదు. మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగిందో కూడా స్పష్టంగా లేదు” అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, బనకచర్ల విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఆపాలని అర్వింద్ స్పష్టం చేశారు.