Pranav Mohanlal: కొంతమంది అంతే ఇతరుల కోసం కాకుండా తమకోసం తాము కష్టపడుతూ ఉంటారు. మనసుకు నచ్చిన పనులు చేస్తుంటారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకుదీ ఇదే పంథా. తండ్రి అడుగుజాడల్లో నడుస్తు బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసిన ప్రణవ్… ఆ తర్వాత జీతూ జోసఫ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ పైన ‘ఆది’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అతను నటించిన ‘హృదయం’ మూవీ కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇంతా చేస్తే… ప్రణవ్ ఇప్పుడు ఇండియాకు దూరంగా స్పెయిన్ లో ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు. అక్కడ గుర్రాలు, మేకల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
Pranav Mohanlal: ఈ మాటలను అతని తల్లి, మోహన్ లాల్ భార్య సుచిత్ర ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. మోహన్ లాల్ కొడుకుగా అతను సినిమాల్లో నటించాలన్నది తమ కోరిక అని, కనీసం ఏడాదికి రెండు సినిమాలైన చేయమని అడుగుతూ ఉంటామని తెలిపింది. అయితే కథ నచ్చకుండా అతను ఏ సినిమా అంగీకరించడని, అప్పుడప్పుడూ తమ కోరిక మన్నించి, కథలు వింటూ ఉంటాడని చెప్పింది. ఏదేమైనా తన కొడుకు కు సినిమా రంగం కంటే వ్యవసాయం, దాని ఆధారిత వ్యవహారాలే ఇష్టమని సుచిత్ర తెలిపింది.