MLC kavitha: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాక, భవిష్యత్తులో కూడా కీలక పాత్రధారుడు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తానే తెలంగాణ భవిష్యత్తు అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“నేను రాష్ట్ర భవిష్యత్తుని” అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, కానీ నిజమైన తెలంగాణ భవిష్యత్తు కేసీఆరేనని తేల్చి చెప్పారు. “రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి… తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే! మీరు ఏ రీతిగానూ ఆయనతో సరితూగలేరు” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇఫ్తార్ విందులో కీలక వ్యాఖ్యలు
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, తమకు తెలంగాణ అంటే ఒక బాధ్యత (టాస్క్) అని, కానీ ఇతరులకు మాత్రం తెలంగాణ రాజకీయం చేయడానికి ఒక అవకాశమని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరును నిద్రలో కూడా జపిస్తున్నారని విమర్శించిన ఆమె, “రైతుబంధు ఇవ్వను కానీ కఠినంగా మాట్లాడతా, రుణమాఫీ చేయను కానీ ఆత్మవిశ్వాసంగా ఉంటా, సాగునీరు అందించను కానీ బోలెడంత హడావుడి చేస్తా, ఉద్యోగాలు ఇవ్వను కానీ ఊదరగొట్టే మాటలు చెబుతా, కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వను కానీ అర్థంలేని మాటలు చెబుతా” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రజలు టీవీ మ్యూట్ చేస్తున్నారు
కేసీఆర్ మాట్లాడితే ప్రజలు ఏం మాట్లాడుతున్నారో వినేందుకు టీవీలను ఆన్ చేస్తారని, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు టీవీని మ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. సీఎం మాట్లాడే ముందు సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ తీసుకోవాలో కూడా ప్రజలు ఆలోచించాల్సిన స్థితి ఏర్పడిందని మండిపడ్డారు.
ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇచ్చే తఫాలు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించిన కవిత, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మసీదుల సుందరీకరణ కోసం ఒక్కో మసీదుకు రూ. 1 లక్ష ఇచ్చేవాళ్లమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ముస్లింల పక్షాన ఏ పార్టీ నిలుస్తుందో ఇప్పుడైనా ప్రజలకు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విస్మరించబడాయని, అవన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ముస్లిం సమాజం, ఈ వివక్షను గమనించాలని ఎమ్మెల్సీకవిత సూచించారు.