MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ అధిష్టానం పక్కన పెట్టి, టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గౌరవాధ్యక్ష పదవిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు పదేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న కవితను తొలగించడంపై, ఆమె గురువారం స్పందించారు.
కవిత ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో, “గత పదేళ్లుగా కార్మిక కుటుంబాలకు అక్కగా, చెల్లిగా అండగా నిలిచే అవకాశం నాకు దక్కింది. ఈ పదవిలో ఉన్నా లేకపోయినా, ఎల్లప్పుడూ కార్మిక కుటుంబాల అండగా ఉంటాను” అని స్పష్టం చేశారు.
తన పదవీకాలం గుర్తుచేసుకున్న కవిత
కవిత తన ప్రకటనలో సింగరేణి కార్మికుల కోసం తాను చేసిన సేవలను వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిపెండెంట్ ఉద్యోగాల వ్యవస్థ రద్దు అయినా, తన కృషితో మళ్లీ అమలులోకి తెచ్చి, సుమారు 19,463 మందికి ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు. కార్మికులకు వడ్డీ రహిత హౌసింగ్ లోన్స్, ఉచిత కరెంట్, ఏసీ సదుపాయాలు, కార్మిక పిల్లలకు ఫీ రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయించానని తెలిపారు.
ఇది కూడా చదవండి: Lady Don Aruna: అరుణ తో మాములుగా ఉండదు.. చిన్న ఉదోగ్యం నుండి డోన్ గా మారింది..
అదేవిధంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులను ఐక్యపరిచిన పోరాటాన్ని, సమ్మెల ద్వారా స్వరాష్ట్ర సాధనలో తమ పాత్రను కవిత ప్రస్తావించారు.
కుట్రలకే బలి: కవిత ఆరోపణ
తనపై జరుగుతున్న పరిణామాలు రాజకీయ కుట్రల ఫలితమేనని కవిత వ్యాఖ్యానించారు. “నేను పార్టీ కార్యక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తడం వల్ల కొందరు కక్షగట్టారు. నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, కార్మిక చట్టాలకు విరుద్ధంగా కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టు ప్రకటించడం కూడా దానికి నిదర్శనం” అని అన్నారు.
అలాగే, కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేయడం వెనుక కూడా కుట్రదారులే ఉన్నారని, వారు తనను వివిధ రూపాల్లో వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి హామీ
“టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా లేకపోయినా, కార్మికుల పక్కనే నిలుస్తాను. మీ సమస్యలకు ఎప్పుడూ అండగా ఉంటాను. ఈ పదవి మార్పుతో నాకు వ్యక్తిగత నష్టం ఏమీ లేదు, కానీ కార్మికుల ఐక్యతను దెబ్బతీయడమే కొందరి ఉద్దేశంగా కనిపిస్తోంది” అని కవిత స్పష్టం చేశారు.