Rowdy Sheeter Srikanth: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌కి పెరోల్ ఇవ్వడం చుట్టూ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ నేతలు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు కోటంరెడ్డి సహకరించారంటూ ఆరోపణలు గుప్పిస్తుండగా, కోటంరెడ్డి స్వయంగా వివరణ ఇచ్చారు.
తండ్రి విజ్ఞప్తితోనే లేఖ
శ్రీకాంత్ తండ్రి అభ్యర్థన మేరకు తాను రికమెండేషన్ లేఖ ఇచ్చిన విషయాన్ని కోటంరెడ్డి ఒప్పుకున్నారు. అయితే, ఆ లేఖను జూలై 16న పోలీసులు లిఖితపూర్వకంగా తిరస్కరించారని తెలిపారు. “ప్రజా ప్రతినిధులుగా ఎన్నో అభ్యర్థనలకు లేఖలు ఇస్తుంటాం. అందులో ఇది కూడా ఒకటే” అని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Cabinet Meeting: ఆగస్టు 25న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం.. ఆ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం!
గతంలోనే ఇతరుల లేఖలు కూడా
శ్రీకాంత్ పెరోల్ వివాదం తనకే పరిమితం కాదని, గతంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్యలు కూడా అలాంటి లేఖలు ఇచ్చారని కోటంరెడ్డి వెల్లడించారు. “నేను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించడంతో విషయం అక్కడే ముగిసిపోయింది. ఇకపై ఇలాంటి పెరోల్ లేఖలు ఎవరికి ఇవ్వను” అని స్పష్టం చేశారు.
రాజకీయ వేడి పెరుగుతోంది
శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు, కౌంటర్లతో నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ వివాదం ఇంకా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.