Minister Nimmala Rama Naidu: గత ఐదేండ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగానికి తీరని నష్టం వాటిల్లిందని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్లు పెట్టి ప్రాజెక్టులను నిర్మిస్తే వాటి నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
Minister Nimmala Rama Naidu: ఏపీ సచివాలయంలో మంగళవారం (మే 13) సాగునీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని, గత ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా వివరించారు.
Minister Nimmala Rama Naidu: రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ పనుల మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.344 కోట్ల నిధులను మంజూరు చేశారని మంత్రి రామానాయుడు వివరించారు. రూ.10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని ఆయన ఆదేశాలను జారీ చేశారు. మిగతా పనులను షార్ట్ టెండర్ల తో చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ మే నెలాఖరు నాటికి ఆయా పనులను పూర్తి చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.
Minister Nimmala Rama Naidu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలువల్లో కనీసం పూడికను కూడా తీయించలేదని మంత్రి రామానాయుడు ధ్వజమెత్తారు. షట్టర్లు, డోర్లు, గేట్లకు కనీస మరమ్మతులు చేపట్టకపోగా, గ్రీజు కూడా పెట్టించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని విమర్శించారు. దీంతో ఆ ప్రభుత్వ హయాంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
Minister Nimmala Rama Naidu: గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఇప్పటి కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటూ, సాగునీటి రంగాన్ని గాడిలో పెడుతున్నదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ నెలలో రూ.90 కోట్లతో, సెప్టెంబర్‌లో అత్యవసర పనుల కోసం రూ.326 కోట్లతో నిర్వహణ పనులు చేయించామని మంత్రి వివరించారు.