Hyderabad: హైదరాబాద్ నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాపులో ఆరుగురు సభ్యుల ముఠా గన్‌ఫైర్ చేసి భారీ దోపిడీకి పాల్పడింది. మంగళవారం ఉదయం షాపు తెరిచిన ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ దారుణం జరిగింది.
ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో దుండగులు షాపులోకి చొరబడ్డారు. వారిలో ఇద్దరు గన్‌లతో సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన డిప్యూటీ మేనేజర్ కాళ్లపై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో రెండు రౌండ్లపాటు గన్‌ఫైర్ చేశారు. షాపులో ఉన్న సీసీ కెమెరాలపై కూడా కాల్పులు జరిపి వాటిని ధ్వంసం చేశారు. అనంతరం కళ్ల ముందున్న బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు.
దోపిడీ అనంతరం దొంగలు జహీరాబాద్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లాల సరిహద్దులను అలర్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు దొంగలను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఇలాంటి దోపిడీ జరగడం సంచలనం కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.