Chiranjeevi: టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. సినీ రంగానికి, సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు, పురస్కారాలను అందుకున్న చిరంజీవి, ఈసారి అంతర్జాతీయ స్థాయిలో మరొక ఘనత సాధించనున్నారు.
హౌస్ ఆఫ్ కామన్స్ – యూకే పార్లమెంటులో చిరంజీవికి గౌరవ సత్కారం
యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదికగా చిరంజీవిని సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాన్ని యూకే అధికార లేబర్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు నవేందు మిశ్రా నిర్వహించనున్నారు. మార్చి 19న జరగనున్న ఈ వేడుకకు పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తదితరులు హాజరుకానున్నారు.
Also Read: Srikanth Addala: రీరిలీజ్ తో మరో ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్ అడ్డాల?
‘జీవిత సాఫల్య పురస్కారం’తో మెగాస్టార్ చిరంజీవి ఘనత
ఈ వేడుకలో బ్రిడ్జ్ ఇండియా అనే ప్రముఖ సంస్థ చిరంజీవిని ‘కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో విశిష్టత’ కింద లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తో సత్కరించనుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకేలో ప్రజాపాలన, సామాజిక సేవలకు తోడ్పడే ప్రముఖ సంస్థగా పేరు పొందింది. సాంస్కృతిక రంగంలో చిరంజీవి చేసిన సేవలను గౌరవిస్తూ, ఈ అవార్డును తొలిసారిగా అందజేయనుండడం ప్రత్యేకత.
యూకే పార్లమెంట్ వేదికగా చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం జరగడం, ఆయన కెరీర్లో మరో గొప్ప మైలురాయిగా నిలవనుంది. ఈ పురస్కారం మెగాస్టార్ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది.