KTR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. సభలో గవర్నర్ ప్రసంగిస్తుండగానే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు విషయంపై ఆయన చెప్తుండగా, బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో సభ హోరెత్తింది. ఆ ప్రసంగం పూర్తికాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా వైఫల్యంతోనే 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత దశలో సాగునీటి వైఫల్యంతో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పంటలు ఎండిపోకుండా సాగునీటిని వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తదని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలిందని తెలిపారు.
KTR: కేసీఆర్‌పై గుడ్డి ద్వేషంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతంలో పంటపొలాలు ఎండిపోయాయని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ చేతగానితనం వల్లే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిన పంటపొలాలకు రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వానిది నో విజన్.. ఓన్లీ కమిషన్.. అని కేటీఆర్ ధ్వజమెత్తారు. విజన్ లేని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో 20 శాతం కమీషన్ మాత్రం ఉన్నదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప, రేవంత్‌రెడ్డికి వేరే విజన్ అంటూ ఏమీ లేదని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే తొలిసారి అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గురుకులాల్లో ఎందరో విద్యార్థులు చనిపోయారని, ఆ విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలుపని అసమర్థ ప్రభుత్వం ఇది అని కేటీఆర్ విమర్శించారు.
KTR: మూడేండ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని, రాహుల్‌గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుంచి మంచిగా మూటగట్టి గాంధీభవన్‌కు పంపిస్తాం.. ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోండి.. అని కేటీఆర్ సచివాలయంలో కాంగ్రెస్ సర్కార్ పెట్టిన విగ్రహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.