Ktr: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధరల తగ్గింపుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే అన్ని వస్తువుల ధరలు సహజంగానే తగ్గుతాయని కేటీఆర్ గుర్తు చేశారు.
చేనేత రంగంపై జీఎస్టీ విధింపుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా 5 శాతం జీఎస్టీ విధించి, తర్వాత దాన్ని 12 శాతానికి పెంచడం కేంద్రం అన్యాయమని విమర్శించారు. అప్పుడే తమ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయం తర్వాత లక్షలాది కుటుంబాలు చేనేత రంగంపైనే ఆధారపడ్డాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదని, అది మన సాంస్కృతిక వారసత్వమని ఆయన పేర్కొన్నారు. చేనేతపై పన్ను వేయడం అంటే మన సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.