Cm chandrababu: కలియుగ దైవానికి అజ్ఞాత భక్తుడి మహాదానం – 121 కిలోల బంగారం విరాళం

Cm chandrababu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు అపూర్వమైన విరాళాన్ని సమర్పించనున్నారు. ఏకంగా 121 కిలోల మేలిమి బంగారం స్వామివారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.

మంగళగిరిలో మంగళవారం జరిగిన ‘పీ4’ (ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యం) కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ సమాచారాన్ని పంచుకున్నారు.

భక్తుడి విజయకథ

“నాకు బాగా తెలిసిన ఒక భక్తుడు ఉన్నారు. ఆయన ఎంతో కష్టపడి ఒక కంపెనీ స్థాపించారు. వ్యాపారంలో విజయవంతం అయిన తర్వాత తన కంపెనీలో 60 శాతం వాటాలను విక్రయించారు. దాంతో ఆయనకు దాదాపు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 6,000 కోట్ల రూపాయలు) వచ్చాయి. ఈ సంపద అంతా వెంకటేశ్వర స్వామి కృప వల్లే వచ్చిందని గాఢంగా నమ్మిన ఆయన, కృతజ్ఞతగా స్వామివారికి 121 కిలోల బంగారం విరాళంగా సమర్పించాలని నిర్ణయించారు. దీని విలువ దాదాపు రూ. 150 కోట్లు అవుతుంది” అని చంద్రబాబు వివరించారు.

అయితే, తన పేరును ఎక్కడా బయట పెట్టవద్దని ఆ భక్తుడు స్పష్టంగా లేఖ ద్వారా కోరారని కూడా తెలిపారు.

ప్రత్యేకత ఏమిటి?

సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సాధారణంగా తిరుమలలో ప్రతిరోజూ స్వామివారికి సుమారు 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారు. యాదృచ్ఛికంగా ఆ భక్తుడు కూడా 121 కిలోల బంగారం విరాళం ఇస్తుండటం విశేషమని చెప్పారు. “ఇంత పెద్ద మొత్తంలో ఒకే వ్యక్తి ఇస్తున్నారంటే, అది ఆయన భక్తిశ్రద్ధకు నిదర్శనం” అని పేర్కొన్నారు.

“మంచి పనులు చేస్తేనే జీవితానికి సార్థకత” – చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమాజానికి సందేశం ఇచ్చారు. “పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. కానీ మన జీవితంలో నలుగురికీ స్ఫూర్తి కలిగించేలా మంచి పనులు చేస్తేనే జీవితానికి అర్థం వస్తుంది. ఆ అజ్ఞాత భక్తుడు దాతృత్వానికి మంచి ఉదాహరణ” అని అన్నారు.

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 13 లక్షల బంగారు కుటుంబాలు, 1.40 లక్షల మార్గదర్శులు గుర్తించబడ్డారని ఆయన వెల్లడించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *