Kishan reddy: ఇవ్వాల (ఆదివారం) సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “అప్పులు ఇచ్చే వారే లేరు, నన్ను నమ్మే వారే లేరు” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని ఆయన ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ
“ఎన్నో పోరాటాలు చేసి, అనేక త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబ పాలన బారిన పడి ఎలా నాశనమైందో మనందరికీ తెలుసు. ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అవినీతి, దోపిడీ, అహంకారం, కుంభకోణాలు, కుటుంబ పాలన… ఇవే గత పాలన లక్షణాలుగా నిలిచాయి” అని విమర్శలు గుప్పించారు.
అలానే, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ పాలన సాగిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి రావాలంటే, ప్రజల ఆశయాలు నెరవేరాలంటే, అది బీజేపీతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
“వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైనా కావొచ్చు.. కానీ మోదీ నాయకత్వంలో కాషాయ జెండా తెలంగాణపై ఎగురుతుంది. తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీయే” అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి బీజేపీ కార్యకర్త, నాయకుడు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఈటల రాజేందర్‌ను కొనియాడుతూ,
“ఒక్క రోజు కూడా సెలవు లేకుండా ప్రజల కోసం పని చేస్తూ, నిజమైన ప్రజాప్రతినిధిగా నిలిచారు” అని ప్రశంసించారు.
సభ అనంతరం జైన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల్లో ప్రతిభ చూపిన వారికి నోట్‌బుక్స్ మరియు మెరిట్ స్కాలర్‌షిప్‌లను కిషన్ రెడ్డి అందజేశారు.