KCR: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోస్ కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల ఇంజినీర్లను, న్యాయ నిపుణులను విచారించిన కమిషన్.. ఈ సారి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను విచారణకు ఆహ్వానించింది. ఈ మేరకు గతంలో కూడా పిలిచినా వీరు హాజరు కాలేదు. అయితే జూన్ 5న జరిగే విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దీంతో అంతటా ఉత్కంఠ నెలకొన్నది.
KCR: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటివరకు 100 మందికి పైగా అధికారులు, ప్రైవేటు ప్రతినిధులను విచారించింది. వారిలో చాలా మంది అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని కమిషన్ ఎదుట తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే విచారణకు హాజరువుతామని ఇప్పటికే హరీశ్‌రావు, ఈటల ప్రకటించగా, కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొన్నది.
KCR: గతంలో విద్యుత్తు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ నోటీసులిచ్చినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో ఆయన వైఖరిపై సందిగ్ధత నెలకొన్నది. హాజరవుతారా? లేదా? అన్న మీమాంస తెరదించుతూ ఎట్టకేలకు జూన్ నెల 5న విచారణకు హాజరు కావాలనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది.
KCR: ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావుతో రెండు దఫాలు చర్చలు జరిపారు. ఒకసారి కేటీఆర్‌తోనూ ఇదే విషయమై చర్చించినట్టు తెలిసింది. కమిషన్ నోటీసులకు ఎలా స్పందించాలి, విచారణ సమయంలో అడిగే ప్రశ్నలకు మౌఖికంగానా లేఖ లిఖితపూర్వకంగా ఇవ్వాలా? అన్న అంశాలపై న్యాయ నిపుణులతోనూ చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే విచారణకు హాజరైన కొందరు రిటైర్డ్ ఇంజినీర్లతోనూ కేసీఆర్ మాట్లాడారని తెలిసింది.
KCR: మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులపై కేసీఆర్ పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) ఏం చెప్పింది? విజిలెన్స్ నివేదికలోని అంశాలు, ఎక్కడ లోపాలు జరిగాయి? బ్యారేజీల నిర్మాణ సంస్థలు కమిషన్‌కు ఎలాంటి సమాచారం ఇచ్చాయి? సమస్యలకు అసలు కారణాలేంటి? అన్న కోణాల్లో ఆయన ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. అదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రాజెక్టులు, నిర్మాణాల విషయాల్లో జరిగిన ఇబ్బందులపై సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా, జూన్ నెల 9న హరీశ్‌రావు విచారణకు హాజరుకానున్నారు.