Kcr: తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగి ఉంటే బీఆర్ఎస్ సత్తా ఏంటో మరింత స్పష్టంగా తెలిసేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అహంకార ధోరణితో వ్యవహరించలేదని స్పష్టం చేసిన కేసీఆర్, ప్రజలతో ఎప్పటికీ వినయంగా మెలిగామని చెప్పారు. ఏదేమైనా, ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మెరుగైన ఫలితాలు రావడం సంతోషకరమని, అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
గ్రామ స్థాయి ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

