Mohan bagavath: కోల్‌కతాలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది వేడుకల్లో సంఘ్ అధినేత మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ను బీజేపీతో ముడివేయడం పెద్ద తప్పు అని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ గురించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని భగవత్ తెలిపారు. బీజేపీలో పలువురు నాయకులు ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో ఉన్నారన్న కారణంతో, సంఘ్‌ను రాజకీయ పార్టీగా భావించడం సరైంది కాదన్నారు. ఆర్ఎస్ఎస్కు ఎలాంటి రాజకీయ అజెండా లేదని, అది పూర్తిగా సామాజిక సంస్థ మాత్రమేనని ఆయన ఉద్ఘాటించారు.
సంఘ్ ఎవరి పట్ల విరోధభావంతో పనిచేయదని, హిందూ సమాజ ఐక్యత, సౌహార్ద్రత, శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తుందని భగవత్ స్పష్టం చేశారు. చాలామందికి ఆర్ఎస్ఎస్ పేరు మాత్రమే తెలుసని, కానీ దాని సేవా కార్యక్రమాలు, సామాజిక పాత్ర గురించి అవగాహన లేదని వ్యాఖ్యానించారు.
సంఘ్ అభివృద్ధి చెందడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అపోహలు సృష్టిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. హిందూ సమాజాన్ని బలంగా, ఏకతాటిపై నిలబెట్టడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన ఉద్దేశమని మరోసారి స్పష్టం చేశారు.
