JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. దేశంలో అనుకోని విషాదం సంభవిస్తే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘యూఎస్‌ఏ టుడే’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రంప్ చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. “ఆయనతో పనిచేసేవారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్లే. అయినప్పటికీ, వారందరి కంటే చివరిగా నిద్రపోయి, అందరికంటే ముందు నిద్ర లేచేది ట్రంపే” అని తెలిపారు. ట్రంప్ తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని తనకు నమ్మకం ఉందని కూడా ఆయన అన్నారు.
అయితే, కొన్నిసార్లు జీవితంలో ఊహించని విషాదాలు జరుగుతాయని, అలాంటి పరిస్థితులలో దేశాన్ని నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు.ఈ ప్రకటనతో ట్రంప్ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారసుడిగా వాన్స్ పేరు బలంగా వినిపిస్తోంది.
Also Read: Peter Navarro: మోదీ ఇదేమి వైఖరి.. అమెరికా మరో ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు
కొన్ని రోజుల క్రితం ట్రంప్ కాళ్లకు వాపులు, చేతిపై మచ్చల కారణంగా ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయమై వైట్‌హౌస్ స్పందిస్తూ, ట్రంప్‌కు ‘దీర్ఘకాల సిరల వ్యాధి’ (Chronic Venous Insufficiency) ఉన్నట్లు నిర్ధారించిందని, ఇది వృద్ధులలో సాధారణంగా కనిపించే రక్తప్రసరణ సమస్య అని వివరించింది. అయితే, చేతిపై మచ్చ గురించి మాత్రం సరైన వివరణ ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ వారసుడి గురించి రిపబ్లికన్ పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వాన్స్ నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ స్వయంగా సూచించినట్లు తెలుస్తోంది. తన 41 ఏళ్ల వయసులో దేశానికి సేవ చేసే అవకాశం వస్తే సద్వినియోగం చేసుకుంటానని వాన్స్ వెల్లడించారు. జేడీ వాన్స్ వ్యాఖ్యలు ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న సందేహాలకు బలం చేకూర్చాయా, లేదా ఆయన తన వారసత్వాన్ని ధృవీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.