India-Pakistan

India-Pakistan: యుద్ధం జరిగిన మూడు రోజుల్లో ఏం జరిగింది..?

India-Pakistan: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని వణికించింది! ఇందుకు కారణం పిచ్చోడి చేతిలో రాయిలా, పాక్‌ చేతిలో ఉన్న అణ్వాయుధమే. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌ను భారత్ గట్టి దెబ్బకొట్టగా, నిరాశలో ఉన్న పాక్ అణ్వాయుధాల ప్రయోగం గురించి చర్చించినట్లు వార్తలొచ్చాయ్‌. ఒక్క అణుబాంబు పేలినా మినిమం 2 కోట్ల మంది మరణం, లక్షలాది మంది రేడియేషన్ బారిన పడే అవకాశం ఉంది. 200 కోట్ల మంది కరవుకు గురవుతారు. అందుకే… భారత్ సంయమనం పాటిస్తున్నా, ఒకవేళ పాక్ అనాలోచిత నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందోనన్న భయం అందర్నీ వెంటాడింది. ఈ క్రమంలో అనూహ్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ నుండి ప్రకటన వెలువడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

భారత్-పాకిస్తాన్ మధ్య నడిచిన సైనిక ఉద్రిక్తతలు అణుయుద్ధ భయాందోళనలను రేకెత్తించాయి. ఏప్రిల్ 22, 2025న జమ్మూ-కశ్మీర్‌లో 26 మంది పర్యాటకులు హత్యకు గురైన ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. పాక్ సైన్యం ఈ దాడులను తిప్పికొట్టలేక, నిరాశతో ‘పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ’తో అత్యవసరంగా సమావేశమై… అణ్వాయుధ ప్రయోగంపై చర్చిస్తోందన్న ప్రచారం ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే భారత్‌-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా ట్రంప్‌ ప్రకటించడం, దానిని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ ధృవీకరించడం కూడా జరిగిపోయాయి. ఏప్రిల్‌ 22 మధ్యాహ్నం 3 గంటల నుండి మే 10 సాయంత్రం 5 గంటల వరకూ… అసలేం జరిగింది? కాల్పుల విరమణకు భారత్‌ ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఏప్రిల్ 22, 2025.. మంగళవారం మధ్యాహ్నం.. పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో ఐదుగురు ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిళ్లతో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాళీ మరణించారు. ఉగ్రవాదులు హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకున్నట్లు సాక్షులు తెలిపారు. అదే రోజు సాయంత్రం.. లష్కర్-ఇ-తొయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడికి బాధ్యత వహిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 22వ తేదీ రాత్రి… భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడి చేసినవారు, వారి మద్దతుదారులను ఊహించలేని విధంగా శిక్షిస్తామని ప్రధాని ప్రకటించారు. జమ్మూ-కశ్మీర్ పోలీసులు.. దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులను గుర్తించారు. వీరిలో ఇద్దరు పాకిస్తానీయులుగా, ఇద్దరు స్థానికులుగా పేర్కొంటూ రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించారు. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన జారీ చేసింది.

ఏప్రిల్ 23, 2025… బుధవారం ఉదయం… జమ్మూ-కశ్మీర్ పోలీసులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బైసరన్‌లో దర్యాప్తు ప్రారంభించాయి. అదే రోజు మధ్యాహ్నం భారత్ పాకిస్తాన్‌తో 1960 సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దు మూసివేసింది. పాకిస్తానీ పౌరులకు వీసాల రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్‌ 23 సాయంత్రం… పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను తగ్గించామని, రాయబార కార్యాలయ సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించామని భారత విదేశాంగ సహాయ మంత్రి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. అయితే అనూహ్యంగా ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఉగ్ర సంస్థ.. ఈ దాడికి బాధ్యత తమది కాదంటూ మాట మార్చింది. భారత సైబర్ ఇంటెలిజెన్స్ ఈ దాడిని తప్పుదోవ పట్టించేందుకు తమపైకి నెడుతోందని ఆరోపించింది.

ALSO READ  Today's Chanakya Exit Poll: చాణక్య లెక్క బీజేపీ హఫ్ సెంచరీ..

ఏప్రిల్ 24, 2025… గురువారం ఉదయం… ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజనాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. మధ్యాహ్నం.. జమ్మూ – కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 24 సాయంత్రం నుండి పాకిస్తాన్ సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది. భారత సైన్యం ధీటుగా స్పందించింది. ఏప్రిల్ 25 శుక్రవారం రాత్రికి పాకిస్తాన్ సైన్యం LoC వెంబడి మళ్లీ కాల్పులు జరిపింది. భారత్ పాకిస్తాన్ రాయబారులకు బహిష్కరణ నోట్ అందజేసింది. ఏప్రిల్ 26 శనివారం ఉదయం… జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆరు ఇళ్లను ధ్వంసం చేశారు. ఏప్రిల్‌ 26 మధ్యాహ్నం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ “తటస్థ దర్యాప్తు”కు సిద్ధమని ప్రకటించారు. కానీ ఆ రోజు రాత్రి కూడా LoC వెంబడి పాక్‌ కాల్పులు కొనసాగాయి.

ఏప్రిల్ 27, 2025… ఆదివారం ఉదయం… జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి, దాడిని ఖండించింది. రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇరు దేశాలూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ… పాకిస్తాన్ తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో చైనా బలమైన మద్ధతిస్తుందని ప్రకటించాడు. ఏప్రిల్ 28 సోమవారం ఉదయం LoC వెంబడి పాకిస్తాన్ నాల్గవ రోజు కాల్పులు జరిపింది. మధ్యాహ్నం NIA దర్యాప్తులో పెహల్గాం దాడిలో లష్కర్-ఇ-తొయిబా, పాకిస్తాన్ ISIకి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
ఏప్రిల్ 29వ తేదీ రాత్రి… అఖ్నూర్ సెక్టార్‌లో కాల్పులు తీవ్రమయ్యాయి. భారత్ 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. ఏప్రిల్ 30న… భారత్ పాకిస్తాన్ విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. ఎనిమిదవ రోజు LOC వెంబడి పాకిస్తాన్ కాల్పులు కొనసాగాయి.

మే 1, 2025… గురువారం ఉదయం… భారత్ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్య దేశాలకు పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతుపై ఆధారాలు సమర్పించింది. మే 5న యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ దాడిని ఖండించి, సంయమనం పాటించాలని కోరారు. భారత్ ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను పాకిస్తాన్‌కు నిధులు తగ్గించాలని కోరింది. మే 6న భారత్… యూఎస్, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యాకు ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం అందించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 244 జిల్లాల్లో మే 7న మాక్ డ్రిల్స్‌కు ఆదేశించింది. మే 7 బుధవారం తెల్లవారుజామున.. సమయం 1:45 గంటలు… భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి, పాకిస్తాన్, PoKలోని 9 ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. లష్కర్-ఇ-తొయిబా, జైష్-ఇ-మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఉదయం హోం మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో సమీక్షా సమావేశం  నిర్వహించారు.

ALSO READ  Delhi: డేంజర్ లో ఢిల్లీ జనాలు ఉక్కిరిబిక్కిరి

ఇది కూడా చదవండి: India VS Pakisthan: ఇవాళే భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఈ అంశాల‌పైనే చ‌ర్చ‌లు.. పాక్ ఉల్లంఘ‌న‌ల‌ న‌డుమ ఉత్కంఠ‌

భారత్‌ దాడులు పాక్ సైనిక స్థావరాలను కానీ, పాక్‌ పౌరులను కానీ లక్ష్యంగా చేసుకుని జరగలేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 8… గురువారం రాత్రి… పాకిస్తాన్ డ్రోన్‌లు, క్షిపణులతో… జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లో దాడులు చేసింది. భారత్ రక్షణ వ్యవస్థలు పాక్‌ దాడులను తిప్పికొట్టాయి. మే 9… శుక్రవారం ఉదయం… పూంచ్, రాజౌరీ జిల్లాల్లో LoC వెంబడి పేలుళ్లు సంభవించాయి. అదే రోజు భారత్ యూఎన్‌ఎస్‌సీ సభ్యులకు పాకిస్తాన్ ఉగ్రవాద మద్దతుపై బ్రీఫింగ్ ఇచ్చింది. మే 10.. శనివారం ఉదయం… ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO’s హాట్‌లైన్‌లో జరిపిన చర్చల కారణంగా కాల్పుల విరమణపై అంగీకారం కుదిరింది. మే 10.. సాయంత్రం 5 గంటలు… భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా కాల్పుల విరమణ సాధించినట్లు విక్రమ్ మిస్రీ ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యూఎస్ మధ్యవర్తిత్వం కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించింది. మే 9-10 తేదీలలో రాత్రిపూట జరిగిన చర్చల తర్వాత, ట్రంప్ ‘ట్రూత్ సోషల్‌’లో కాల్పుల విరమణ ప్రకటన చేశారు. యూఎస్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌లు… మోదీ, జైశంకర్ ద్వయం మరియు షరీఫ్, మునీర్‌ల ద్వయంతో ఏకకాలంలో చర్చలు జరిపారు. ఖతార్, యూఎన్, జీ7 దేశాలు సంయమనం పాటించాలని కోరాయి. ఇరు దేశాలూ అణు ఆయుధ శక్తులు కావడంతో, సంఘర్షణ అణు యుద్ధంగా మారుతుందన్న భయం అంతర్జాతీయ సమాజంలో నెలకొంది. భారత్‌లో 27 విమానాశ్రయాల మూసివేత, 430 విమానాల రద్దు, పాకిస్తాన్ గగనతల మూసివేత వల్ల రెండు దేశాల్లో గణనీయమైన ఆర్థిక, రవాణా సంక్షోభం ఏర్పడింది. దీంతో పాటూ పౌర నష్టం రెండు దేశాలపై ఒత్తిడి పెంచింది. పాకిస్తాన్‌లో కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ప్రజలు “లాంగ్ లివ్ పాకిస్తాన్” నినాదాలతో సంబరాలు చేసుకున్నారు.

భారత్‌లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఉగ్రవాదంపై భారత వైఖరి మారదని స్పష్టం చేశారు. మొత్తంగా కాల్పుల విరమణకు అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, ఇరు దేశాల్లో పౌర, సైనిక నష్టాలు, అణు యుద్ధ భయం, ఆర్థిక సంక్షోభం, ద్వైపాక్షిక చర్చలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ నిర్ణయం తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *