Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లలో కీలక మార్పులు చేపట్టారు. ఇకపై ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితిలో సహాయం కోసం ఒక్కటే నంబర్ – డయల్ 112 (Dial 112) ను వినియోగించాల్సి ఉంటుంది అని రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రకటించారు.
ఇప్పటివరకు వేర్వేరు సేవల కోసం వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది:
పోలీస్ సహాయం కోసం 100,
అంబులెన్స్ కోసం 108,
మహిళల భద్రతకు 181,
చిన్నారుల రక్షణకు 1098,
ప్రకృతి విపత్తుల కోసం 1077.
ఇకపై ఈ నంబర్లన్నిటి స్థానంలో ఒకే ఎమర్జెన్సీ నంబర్‌గా 112 పనిచేయనుంది. ఇది దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని డీజీపీ తెలిపారు.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజలు 112కు కాల్ చేస్తే, టీజీఈఆర్సీఎస్ (Telangana Geo Emergency Response Support System) ఆధారంగా వారి స్థానం జీపీఎస్ ద్వారా గుర్తించి, తక్షణమే సమీప పోలీస్, అంబులెన్స్ లేదా సంబంధిత అధికారుల సహాయాన్ని అక్కడికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
అలానే, ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యానిక్ బటన్ ఉపయోగించటం ద్వారా కూడా సహాయాన్ని కోరుకునే అవకాశం కల్పించారు. ఈ విధానం మరింత వేగవంతమైన, సమర్థవంతమైన ఎమర్జెన్సీ స్పందనకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.