Hyderabad: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశం ఈ రోజు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ప్రాంతంలో జరిగినది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం పౌర సరఫరాల విభజన, పరస్పర సహకార విధానాలపై చర్చలు సాగాయి. విభజన ఒప్పందం ప్రకారం ఎర్రమంజిల్‌లో ఉన్న APSCSCL భవనం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడింది. ప్రస్తుతం ఆ భవనంలోని 2వ నుంచి 5వ అంతస్తుల వరకు తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ అద్దెకు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించగా, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ అద్దె ఒప్పందంపై ఇరురాష్ట్రాల మధ్య ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకాలు జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “రైతుల హక్కులను కాపాడేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకం ద్వారా ఒక కోటి పది లక్షల మందికి సబ్సిడీ అందిస్తున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో పథకాలు అమలవుతున్నాయి. ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రైతులకు నష్టం రాకుండా చూస్తున్నాం” అని తెలిపారు.
ఇలాంటి సమావేశాలు ఇరురాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పౌర సరఫరాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేస్తామని తెలిపారు.