Hyderabad: హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేస్తూ, వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఆదేశించారు.
సీఎం రేవంత్ సూచనల ప్రకారం, నగరంలో సేకరించబడే వరదనీరు మూసీ నదికి చేరేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నగరంలోని చెరువులు, నాలాలు, ఇతర కాలువలను మూసీ నదికి అనుసంధానం చేసే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
మూసీ పునరుజ్జీవనమే హైదరాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని నీటిమార్గాల శుద్ధి, విస్తరణ, అనుసంధాన పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.