AP High Court: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఖారిజ చేసింది. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంగా తెలియజేసిన ధర్మాసనం, ఈ అంశంపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని పేర్కొంది.
కడప జిల్లాలోని ఈ రెండు స్థానాల్లో జరిగిన పోలింగ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని, దొంగ ఓట్లను వేయించిందని, పోలీసులు అధికార పార్టీకి సహకరించారని ఆరోపిస్తూ YCP అభ్యర్థులు హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 3, 14ల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరగాలంటూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఇది కూడా చదవండి: Telangana Vehicle Tax: తెలంగాణలో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు.. కొత్త రేట్లు ఇవే
వాదనలు విన్న హైకోర్టు, ఇప్పటికే అవసరమైన చోట రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, అదనపు జోక్యం అవసరం లేదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థిస్తూ, వైసీపీ పిటిషన్‌లను డిస్మిస్ చేసింది.
ఇక ఫలితాల విషయానికి వస్తే — పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,035 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన డిపాజిట్ కోల్పోయారు. ఇక్కడ మొత్తం 74% ఓటింగ్ నమోదైంది.
ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో కూడా టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 12,780 ఓట్లతో విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే లభించాయి.
ఈ తీర్పుతో రెండు స్థానాల్లోనూ ఓటమి ఎదుర్కొన్న వైసీపీకి మరింత నిరాశ ఎదురైంది.