Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ రోజు సాయంత్రం నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ సైన్యం చిన్నపాటి ఆయుధాలు, ఫిరంగులతో భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. గత కొన్ని రోజులుగా పాక్ తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా కాల్పులతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత
పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాల్లోని విమానాశ్రయాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సెలవుల రద్దు
విపత్తు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఆరోగ్య శాఖ ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది మరియు ఇతర ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. ఆరోగ్య సంబంధిత కారణాలను తప్ప, ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవుల రద్దు అమల్లో ఉంటుంది.