Heavy Rains: ఆర్థిక రాజధాని ముంబైను వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం ముంచెత్తిపోయింది. రహదారులపై మోకాళ్ల లోతున నీరు నిలిచిపోవడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, విమానాశ్రయాల్లోనూ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ క్షమాపణలు తెలిపింది.
రెడ్ అలర్ట్ జారీ – విద్యాసంస్థలకు సెలవులు
భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ ముంబైతో పాటు థానే, రాయ్‌గడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయగా, పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. సాధ్యమైన మేరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని అధికారుల సూచన.
సైన్యం రంగంలోకి – రక్షణ చర్యలు ప్రారంభం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్రమాబాద్‌లో ఒక్కరోజులోనే 206 మి.మీ. వర్షపాతం నమోదైంది. ముంబైలో 6–8 గంటల్లోనే 177 మి.మీ. వర్షం కురవడం ఆందోళన కలిగించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించింది. “అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు” అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రజలను హెచ్చరించారు.
విమాన ప్రయాణికులకు జాగ్రత్త సూచన
బుధవారం (ఆగస్టు 19, 2025)న ముంబైలో వర్షాల దెబ్బతీట కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. విమానాశ్రయాలకు అనుసంధానించే ప్రధాన మార్గాలు నీటమునిగిపోవడంతో రాకపోకలు ప్రభావితం అవుతున్నాయని తెలిపింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించింది.
రికార్డు స్థాయి వర్షపాతం
గత 24 గంటల్లో ముంబై తూర్పు శివారులోని విఖ్రోలిలో 255.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. శాంటాక్రూజ్ అబ్జర్వేటరీలో 238.2 మి.మీ. వర్షం కురిసినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ అంతటా 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం నగర వాసులను ఆందోళనలోకి నెట్టింది.
మొత్తానికి, ముంబైను వరుణుడు తీవ్రంగా వేదిస్తున్నాడు. రెడ్ అలర్ట్ జారీ కావడంతో సాధారణ జీవనం స్తంభించిపోయింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే ప్రస్తుతం పరిస్థితిని ఎదుర్కొనే మార్గమని అధికారులు సూచిస్తున్నారు.