Half Day Schools: పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందజేసింది. వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల 35 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ దశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఒంటిపూట బడులను అమలు చేసే తేదీని వెల్లడించింది. మార్చి 15 నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.
Half Day Schools: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి నెల 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతిపాఠశాలలో ఈ ఒంటి పూట బడులను అమలు చేయాలని, నిబంధనలు పాటించకపోతే చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
Half Day Schools: పాఠశాలలను ఉదయం 8 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఏప్రిల్ 23 వరకు ఇదే విధమైన వేళలు పాటించాలని తెలిపింది. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల కారణంగా పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రం మధ్యాహ్నం నుంచే పాఠశాలలు మొదలవుతాయి.
Half Day Schools: ఎండల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో ఇప్పటికే పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల పాఠశాలలు ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించాలని, అదనపు తరగతుల పేరిట పిల్లలను ఇబ్బందులకు గురిచేయవద్దని విద్యావేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు.