Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై టీజీ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. క్రికెట్ అభివృద్ధి కేవలం నగరానికి మాత్రమే పరిమితమైందని, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఆయన విమర్శించారు. HCAను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గురువారెడ్డి మాట్లాడుతూ, “HCA సిటీ వరకే పరిమితమైంది. రాష్ట్రంలోని టాలెంట్‌కు అవకాశాలు లేకుండా పోయాయి. ఎవరు ప్రెసిడెంట్ అయినా HCAలో అవినీతి కొనసాగుతూనే ఉంది,” అని అన్నారు.
నిధుల దుర్వినియోగం పై ఆరోపణలు
బీసీసీఐ తరఫున వస్తున్న నిధులను HCA అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. “కరోనా సమయంలో కోట్లు ఖర్చు చేశామని లెక్కలు చూపారు. కానీ అసలు ఆ డబ్బుతో ఏమి చేశారన్నది ప్రశ్నార్థకమే. లెక్కల్లో స్పష్టత లేదు, పారదర్శకత లేదు,” అని మండిపడ్డారు.
రాజకీయ నాయకుల ప్రమేయంపై హెచ్చరిక:
ఈ అవినీతి వెనుక ఉన్న రాజకీయ నాయకుల పేర్లు త్వరలోనే బహిరంగం చేస్తానని గురువారెడ్డి హెచ్చరించారు. అవినీతి వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. “ఏ నాయకుడు అయినా ఈ స్కాంలో ప్రమేయం ఉంటే బయటపెడతా. న్యాయపరమైన చర్యలు తప్పవు,” అని పేర్కొన్నారు.
తెలంగాణ క్రికెట్‌కు గుర్తింపు వచ్చే వరకూ పోరాటం:
తెలంగాణలో క్రికెట్‌కు అవసరమైన గుర్తింపు రావాలని, జిల్లాల్లోని యువ ప్రతిభావంతులకు సరైన అవకాశాలు కల్పించాలని గురువారెడ్డి స్పష్టం చేశారు.
“రాష్ట్రం కోసం, యువ క్రికెటర్ల భవిష్యత్ కోసం నా పోరాటం కొనసాగుతుంది. క్రికెట్‌ను నగరానికి పరిమితం చేయడం తగదు,” అని అన్నారు.తెలంగాణ క్రికెట్‌ను శాశ్వతంగా అభివృద్ధి చేయాలంటే, HCAలో పారదర్శకత, సమగ్రత తప్పనిసరి అని గురువారెడ్డి స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర క్రికెట్ పాలనపై మరోసారి దృష్టిని సారించాయి.