Noida Dowry Murder: గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే గృహిణి హత్య కేసు మరోసారి సంచలనంగా మారింది. అదనపు కట్నం కోసం భార్యను హింసించి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు విపిన్ భాటి పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతని కాలి భాగానికి గాయమై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిక్కీ వివాహ సమయంలో కారు, నగదు, ఆభరణాలు ఇచ్చినప్పటికీ, విపిన్, అతడి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అదనపు కట్నం కోసం ఒత్తిడి తెచ్చేవారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా విపిన్ మెర్సిడెస్ కారు కొనుగోలు చేసిన తర్వాత, తనకూ అలాంటి కారు ఇప్పించాలని భార్యపై ఒత్తిడి పెంచాడని కుటుంబం వాపోయింది. ఈ కారణంగానే నిక్కీని అతి క్రూరంగా హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: Hyderabad: మేడిపల్లి హత్యకేసులో సంచలన వివరాలు
గత గురువారం విపిన్, అతడి తల్లి దయా కలిసి నిక్కీపై దాడి చేసి, తీవ్రంగా కొట్టిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు సహాయంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ, నిక్కీ ప్రాణాలు కోల్పోయింది. విపిన్‌ను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకెళ్తుండగా, అతడు ఒక పోలీసు అధికారి వద్ద నుండి తుపాకిని లాక్కొని పారిపోవడానికి యత్నించాడు. పదేపదే హెచ్చరించినా వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. ఈ కాల్పుల్లో విపిన్ కాలు గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు.
తన భార్యను తాను చంపలేదని, నిక్కీ స్వయంగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని విపిన్ పోలీసుల ముందూ, మీడియా ముందూ చెబుతున్నాడు. “భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణం. దాంతోనే ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు?” అని ఆయన ప్రశ్నించాడు. మృతురాలి తండ్రి భికారీ సింగ్ కన్నీరు మున్నీరయ్యారు. “వారు హంతకులు.. వారిని కాల్చి చంపాలి. వారి ఇల్లు కూల్చేయాలి. మా కూతురిని కుటుంబం మొత్తం కలసి హత్య చేసింది” అని ఆయన తీవ్రంగా స్పందించారు. నిక్కీ కుమారుడు కూడా “తన తండ్రే అమ్మను కాల్చి చంపాడు” అని పోలీసులకు తెలిపాడు.