Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాసంస్థల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వేలాది మంది సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 4092 మంది గురుకుల కాంట్రాక్ట్ సిబ్బంది సర్వీసులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బోధనా, బోధనేతర సిబ్బందికి ఈ పొడిగింపు వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: విద్యార్థిని అత్యాచారం బాధాకరమే.. కానీ అర్ధరాత్రి బయటకు ఎందుకొచ్చింది?
గురుకుల విద్యా సంస్థల్లో విద్యా బోధన, నిర్వహణ నిరంతరాయంగా కొనసాగేందుకు, సిబ్బంది కొరత తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రభుత్వ తాజా నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. కాంట్రాక్ట్ సిబ్బంది సర్వీసుల పొడిగింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆయా గురుకుల సొసైటీలకు అందాయి. దీనిపై గురుకుల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా ప్రభుత్వం పలువురు గురుకుల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే.