Electric Shock: హైదరాబాద్ రామంతాపూర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గోకులేనగర్‌లో నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సాక్షుల సమాచారం ప్రకారం, ఊరేగింపులో ఉపయోగించిన రథాన్ని లాగుతున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్ అయింది. దీంతో కొందరు యువకులు స్వయంగా రథాన్ని చేతులతో లాగడం ప్రారంభించారు. ఈ సమయంలో రథం పైభాగం విద్యుత్ తీగలకు తగలడంతో క్షణాల్లోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలిన తొమ్మిది మంది నేలకూలగా, వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: America: ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు
మృతులను కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్ (34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (45)గా గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో నలుగురు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో రామంతాపూర్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.