ACB: తెలంగాణలో ఇటీవల లంచావతారులు తరచూ పట్టుబడుతున్నారు. మితిమీరిన లంచగొండితనంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి వారిని పట్టిస్తున్నారు. అయినా ఇంకా ఆ తిమింగళాల సంఖ్య పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా ఓ విద్యాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం కలకలం సృష్టించింది. ఒక ఉపాధ్యాయుడి నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
ACB: మహబూబ్‌నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కాల్సిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈవోకు విజ్ఞప్తి చేశారు. 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ను ఆశ్రయించారు.
ACB: పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా, డీఎస్పీ కృష్ణగౌడ్ సారధ్యంలోని బృందం డీఈవోను అదుపులోకి తీసుకున్నది. అనంతరం 50 వేల రూపాయలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.