Srikalahasti: దిత్వా తుపాను ప్రభావంతో శ్రీకాళహస్తి పట్టణంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఉండి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులు ఈ వర్షం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంలో తడుస్తూనే ఆలయానికి చేరుకోవాల్సి వస్తోంది. ఆలయ పరిసరాలు, వీధులు వర్షపు నీటితో నిండిపోవడంతో వృద్ధులు, చిన్నారులు మరింత కష్టపడుతున్నారు. దర్శనం కోసం గంటల తరబడి వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణ మార్పులతో పర్యాటకుల సంఖ్య కూడా కాస్త తగ్గింది.
అధికారులు అప్రమత్తం:
ఈ తుపాను హెచ్చరిక నేపథ్యంలో నియోజకవర్గ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. వర్షపు నీరు ఎక్కువగా చేరడంతో చెరువులు, కాలువల్లో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చే మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, ప్రజలకు సహాయం అందించేందుకు సిబ్బందిని సిద్ధం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

