Telangana: బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం రాష్ట్రమంతటా వ్యాపిస్తున్నది. మొన్న నల్లగొండలో నిన్న వరంగల్ నగరంలో, నేడు సిరిసిల్ల 17వ బెటాలియన్ వద్ద, డిచ్‌పల్లి 7వ బెటాలియన్ వద్ద కానిస్టేబుళ్ల కుటుంబాలు గురువారం రోడ్లపై ఆందోళనలకు దిగాయి. కానిస్టేబుళ్ల కొత్త సెలవుల విషయంలో వారి కుటుంబాలు రగిలిపోతున్నాయి. ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. పాత సెలవులనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Telangana: గతంలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు వరుసగా 15 రోజులు విధులు నిర్వహిస్తే నాలుగు రోజులు సెలవులు ఇచ్చేవారు. ఈ నెలలో కొత్త నిబంధన తెచ్చారు. అదేమిటంటే వరుసగా 26 రోజులు విధుల్లో పాల్గొంటే నాలుగు రోజులు సెలవులు ఇస్తామని జీవో తెచ్చారు. ఇదే కానిస్టేబుళ్ల కుటుంబాల్లో ఆగ్రహం తెప్పించింది. దీంతో వారంతా పాత సెలవులను ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Telangana: ఇదే కోవలో తొలుత నల్లగొండలోని 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు బెటాలియన్ వద్ద నార్కట్‌పల్లి-ఒంగోలు హైవేపై నిరసనకు దిగారు. ఉన్నతాధికారుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. తమ భర్తలు ఎదర్కొంటున్న ఇతర సమ్యలనూ పరిష్కరించాలని కానిస్టేబుళ్ల భార్యలు డిమాండ్ చేశారు. దీంతో వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అధికారులు వారి భర్తల సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి ఏకంగా ఆందోళనకు దిగిన వారి భర్తలైన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
Telangana: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి వద్ద లక్నవరం సమీపంలోని 5వ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. విధి నిర్వహిణ పేరుతో ప్రభుత్వం కుటుంబాలకు వారిని దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కానిస్టేబుళ్ల భార్యలు, వారి పిల్లలు, తల్లిదండ్రులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఆందోళనలో పాల్గొన్న వారి కుటుంబాలకు చెందిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే దిశలో ఉన్నతాధికారులు ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.
Telangana: తాజాగా సిరిసిల్లలో 17వ బెటాలియన్ వద్ద, డిచ్‌పల్లి 7వ బెటాలియన్ వద్ద గురువారం పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మహిళలు ఏకరువు పెట్టారు. సెలవులు ఇతర సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు వచ్చి వారిని వ్యాన్లలో స్టేషన్‌కు తరలించారు. నల్లగొండలో ఏకంగా కానిస్టేబుళ్లనే సస్పెండ్ చేసినా, వెరవకుండా ములుగు, సిరిసిల్ల డిచ్‌పల్లిలో ఆందోళనలు జరగడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడం శోచనీయం.