Congress Party: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పదవులపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉన్నది. 17 నెలలు కావస్తున్నా మంత్రివర్గ విస్తరణపై ఆ పార్టీకి భయం పట్టుకున్నది. ఇతర పదవులు ఎన్నో ఉన్నా భర్తీ చేయాలంటే ఆ పార్టీ పెద్దలు జంకుతున్నారు. అసంతృప్తి పెరిగి మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు.
Congress Party: ఇదే దశలో పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మరోసారి పార్టీ రాష్ట్ర ముఖ్యులపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించారు. పార్టీ మూల సూత్రాలపై మాట తప్పుతున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. పార్టీలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వారికే పదువులు ఇస్తామన్న హామీని తుంగలో తొక్కుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ అధిష్టానం పెద్దల మాటలను సైతం సీఎం, ఇతర ముఖ్యులు పాటించడం లేదని ఆవేదన చెందారు.
Congress Party: ఏడాది నుంచి మహిళా కాంగ్రెస్ నేతలెవరికీ ఒక్క పదవి కూడా దక్కలేదని సునీతారావు తీవ్రంగా విమర్శించారు. తాజాగా నియమించిన సమాచార హక్కు కమిషనర్ పదవుల్లో ఒక్కరినైనా మహిళా కాంగ్రెస్ నుంచి తీసుకోకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏండ్లుగా కష్టపడి పనిచేసిన మహిళా నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.
Congress Party: ఏకంగా గాంధీభవన్‌లోని మహేశ్‌కుమార్ చాంబర్ ఎదుట నిన్న ధర్నా చేసిన సునీతారావు, ఇతర మహిళా నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహేశ్‌కుమార్ గౌడ్‌కు రెండు పదవులు ఎందుకని సునీతారావు ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. ఆయన తన చెల్లెళ్లు, మరదళ్లకు పదవులు ఇప్పించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక పదవిని వదిలేసి మహిళా నేతలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
Congress Party: తనను మానసిక క్షోభకు గురి చేయొద్దని, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతానని సునీతారావు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా అధిష్టానం పెద్దలతో లేఖలు తెమ్మంటే అన్ని లెటర్లు తీసుకొచ్చామని, అయినా తనకు పదవి ఇవ్వడంలో తాత్సారం ఎందుకని ప్రశ్నించారు.
Congress Party: నామినేటెడ్ పోస్టుల్లోనైనా మహిళా కాంగ్రెస్ నేతలకు ఎందుకు పదవులు కల్పించడం లేదని సునీతారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన మహిళా నేతలకు పదవులు ఇస్తున్నారని, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన మహిళా నేతలను విస్మరిస్తున్నారని సీఎం, ఇతర ముఖ్య నేతలపై ఆమె ధ్వజమెత్తారు. ఇలాంటి వైఖరి కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు.