CM Revanth Reddy:పద్మ అవార్డుల ప్రకటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదుగురిలో ఒక్కరికీ అవార్డును ప్రకటించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు.
CM Revanth Reddy:పద్మ పురస్కారాల కోసం రాష్ట్రప్రభుత్వం ఐదుగురు ప్రముఖుల పేర్లను ప్రతిపాదించి పంపింది. ఈ మేరకు పద్మ విభూషణ్ కోసం గద్దర్, పద్మభూషణ్ కోసం చుక్కా రామయ్య, అందెశ్రీ, పద్మశ్రీ పురస్కారాల కోసం గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వీరిలో ఏ ఒక్కరికీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించలేదు. పద్మ పురస్కారాల ప్రకటనలో తెలంగాణకు జరిగిన అవమానంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారు.
పద్మ విజేతలకు రేవంత్‌రెడ్డి అభినందనలు
CM Revanth Reddy:పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన ప్రముఖులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలందించిన డాక్టర్ డీ నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యావిభాగాల్లో కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.