Cm revanth: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ‘శ్రీమద్భాగవతం – పార్ట్ 1’ చిత్రం శుభారంభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సినిమాను సాగర్ పిక్చర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు భారతీయుల జీవితాల్లో భాగమైపోయాయని పేర్కొన్నారు. మన సంస్కృతిలో విలువల పునాదులు ఈ గ్రంధాల ద్వారానే స్థిరపడాయని తెలిపారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్భాగవతం చిత్రీకరణ జరగడం తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపనతో తెలుగు రాష్ట్రాల గర్వంగా నిలిచిందని, దేశంలోనే ప్రత్యేకత కలిగిన స్టూడియోగా అభివృద్ధి చెందిన ఈ ఫిల్మ్ సిటీని ఉల్లేఖిస్తూ ప్రశంసలు కురిపించారు. “యూనివర్సల్ స్టూడియో చూడలేకపోయినా, రామోజీ ఫిల్మ్ సిటీ మాత్రం ప్రత్యేకతగా ఉంది” అని అభిప్రాయపడ్డారు.
రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం గర్వంగా ఉందని ఆయన చెప్పారు. 40 ఏళ్ల క్రితం ప్రసారమైన రామాయణం సీరియల్ ప్రతి ఇంటికి చేరువైందని, కరోనా సమయంలో మళ్లీ టెలికాస్ట్ అయినప్పుడు ప్రపంచ రికార్డు సాధించిందని గుర్తుచేశారు.
తెలంగాణను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చే దిశగా విజన్ 2047 ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. ఈ డాక్యుమెంటులో సినీ పరిశ్రమకు ప్రత్యేక అధ్యాయం ఉందని చెప్పారు.
రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’ ఎంతటి స్ఫూర్తిదాయక విజయం సాధించిందో, అదే స్థాయిలో ‘శ్రీమద్భాగవతం’ చిత్రం కూడా ప్రజాదరణ పొందాలని సీఎం ఆకాంక్షించారు.