CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న లిక్కర్ స్కాం కేసు మీద ముఖ్యమంత్రి మంత్రులకు కీలక సూచనలు చేశారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – “లిక్కర్ కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉంది. ఇది సున్నితమైన అంశం. ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై స్పందించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అవసరం లేని వ్యాఖ్యలు చేయరాదు. అనవసరంగా రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కూడా కౌంటర్ ఇవ్వాలి. కానీ బాధ్యతతో స్పందించాలి” అని చెప్పారు.
అలాగే, ఈ కేసుపై ఎవ్వరూ ముందస్తుగా స్పందించకూడదని, ప్రస్తుతం ఈ కేసును S.I.T (సిట్) విచారిస్తోంది అని వివరించారు. కేసులో అరెస్టులు జరుగుతున్నా, ఇంకా దర్యాప్తు పూర్తవలేదు కాబట్టి ప్రభుత్వం తరఫున ఎవరూ అనవసరంగా స్పందించవద్దని వార్నింగ్ ఇచ్చారు.
మద్యం విధానంలో అక్రమాలు – రూ. 3,200 కోట్ల నష్టం
2019 నుండి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయని సిట్ తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా జాతీయ బ్రాండ్లను తొలగించి, స్థానిక బ్రాండ్లను ప్రోత్సహిస్తూ నెలకు రూ. 50 నుంచి 60 కోట్ల వరకూ లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 12 మందిని అరెస్టు చేశారు. మరో 12 మందిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.
మంత్రులకు సీఎం కీలక దిశానిర్దేశం
ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు తన మంత్రులకు మరో ముఖ్య సూచన చేశారు. “ఇప్పటి వరకు సెలవులు అయిపోయాయి. ఇకపై అందరూ యాక్టివ్ అవ్వాలి. ప్రభుత్వ పథకాలు ప్రజల దాకా వెళ్లేలా ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేయాలి” అని చెప్పిన చంద్రబాబు, సమయాన్ని ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు.