Chris Gayle: ఇటీవల క్రిస్ గేల్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పంజాబ్ కింగ్స్ జట్టులో తనకు అవమానం జరిగిందని, సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. సీనియర్ ఆటగాడిగా తనకు ఇవ్వాల్సిన మర్యాద లభించలేదని, వారు నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీరుపై తన ఆవేదనను అప్పటి కోచ్ అనిల్ కుంబ్లేతో పంచుకున్నానని, ఆ సమయంలో తాను కుంబ్లే ముందు ఏడ్చేశానని గేల్ తెలిపారు.
జట్టు నిర్వహణ పట్ల తాను తీవ్ర నిరాశ చెందానని చెప్పారు. తాను జట్టును వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ తనకు ఫోన్ చేసి క్రిస్, నువ్వే ఆడతావు, ఉండు అని కోరినా తాను వినలేదని గేల్ వెల్లడించారు. తన బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోయానని తెలిపారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కారణంగా తన ఐపీఎల్ కెరీర్ అనుకున్నదానికంటే ముందే ముగిసిపోయిందని గేల్ పేర్కొన్నారు. గేల్ ఈ ఆరోపణలను 2021 సీజన్‌కు సంబంధించి చేశారు, ఆ సీజన్‌లోనే ఆయన జట్టును వీడారు. ఐపీఎల్‌లో తన 175 పరుగుల రికార్డును శుభ్‌మాన్ గిల్ లేదా నికోలస్ పూరన్ వంటి యువ ఆటగాళ్లు బద్దలు కొట్టే అవకాశం ఉందని గేల్ తన యూట్యూబ్ షోలో అభిప్రాయపడ్డారు.