Chiranjeevi

Chiranjeevi: ట్రెండింగ్‌లో చిరంజీవి.. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ అందుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవికి ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం ప్రదానం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగం, సమాజసేవలో చేసిన కృషిని గౌరవిస్తూ ఈ అవార్డు అందించారు. యూకే లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘనతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

చిరంజీవి తన కెరీర్‌లో అనేక అవార్డులు అందుకున్నారు. 2023లో ఆయన ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్పులతో ఆడియన్స్‌ను అలరించినందుకు గిన్నిస్ రికార్డు సాధించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారం ప్రదానం చేసింది. అక్కినేని నాగేశ్వరరావు శత వసంతాల వేడుకల్లో ‘ఏయన్నార్ జాతీయ పురస్కారం’ అందుకోగా, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) ‘అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’గా గౌరవించింది.

ఇది కూడా చదవండి: Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమాకి రికార్డు బిజినెస్!

కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సోషియో-ఫాంటసీ చిత్రం రూపొందుతోంది. త్రిష కథానాయికగా నటిస్తుండగా, మరో ఐదుగురు హీరోయిన్లు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను 2025 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక మరో ప్రాజెక్ట్‌లో, చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి పనిచేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, చిరంజీవితో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో షూటింగ్ ప్రారంభంకానుంది. చిరంజీవి చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ఫన్ జోనర్‌లో సినిమా చేయబోతుండటంతో, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి చివరగా ‘బోళా శంకర్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయినప్పటికీ, అభిమానులు ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘విశ్వంభర’తో మరోసారి మెగాస్టార్ తన సత్తా చాటుతారని అందరూ ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijay Thalapathy: విజయ్‌ ఫ్యాన్స్‌ నుంచి సూర్యకు వార్నింగ్‌?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *