BRS Silver Jubilee Meeting: సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోబోతోంది కారు గుర్తు పార్టీ. 25 ఏళ్ల ప్రస్థానంలో పదేళ్లు అధికారం అనుభవించి, ప్రస్తుతం ప్రతిపక్షంగా రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. సిల్వర్ జూబ్లీ సభపై భారీగా ఆశలు పెట్టుకుంది. భారీ జనసమీకరణ, భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా.. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా భారీ ప్లాన్లు వేస్తున్నారు ఆ పార్టీ అధిష్టానాధిపతులు. అయితే సభ అనుకున్న స్థాయిలో నిర్వహించగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంతో పాటూ, ప్రకృతి నుండి ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఏంటా ఇబ్బందులు? లెట్స్ వాచ్ ద స్టోరీ.
బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరపాలని భావిస్తుంది. వరంగల్ వేదికగా ఏప్రిల్ 24వ తేదీన భారీ బహిరంగ సభకు పూనుకుంది. లక్షన్నర మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం వరంగల్ నగర శివారులో ఆ పార్టీ నేతలు స్థలాన్వేషణ చేస్తున్నారు. బట్టుపల్లిలోని ఎస్ఆర్ కళాశాల శివారు మైదానం లేదా ఉనికిచర్ల శివారులో స్థలం కోసం చూస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసన సభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే బీఆర్‌ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ మృతి
ఏప్రిల్ మాసంలో ఎండలు మండిపోయే అవకాశం ఉంది. దాదాపుగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యవసరం ఐతే తప్ప ప్రజలు బయటకు రాకూడదు అంటూ వైద్యులు సూచిస్తారు. వాతావరణ శాఖ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతారు. వడదెబ్బ తగిలి అనేక మంది విలవిలాడే చాన్స్ ఉంటుంది. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీ సభకు ప్రభుత్వం అనుమతి లభించడం కూడా కష్టమే అంటున్నారు. అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. లక్షలాది మంది జనసమీకరణ చేయడంలో ఆ పార్టీ దిట్ట. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అయితే గతంలో పరిస్థితులు వేరు. ఉద్యమ పార్టీ అనే పేరు ప్రజలందరినీ ఏక తాటిపైకి చేర్చింది. పార్టీలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా అప్పుడు ఏకమయ్యారు, సభలకు భారీగా తరలి వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తారు? అనే సందేహం వ్యక్తం అవుతోంది. కాబట్టి బీఆర్ఎస్ ఏప్రిల్ 24వ తేదీన సిల్వర్ జూబ్లీ సంగర్భంగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ సాధ్యం అవుతుందో, లేదో వేచి చూడాల్సిందే.